థామస్ నాయకత్వంలో పనిచేయండి
ABN , First Publish Date - 2023-06-11T01:42:56+05:30 IST
జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ థామస్ నాయకత్వంలో పనిచేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సూచించారు.
చిట్టిబాబుకు న్యాయం చేస్తాం
మాజీ మంత్రి అమరనాథ రెడ్డి
చిత్తూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ థామస్ నాయకత్వంలో పనిచేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సూచించారు. ఎస్‌ఆర్‌పురం మండల టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అమర్‌తోపాటు జిల్లా కో-ఆర్డినేటర్ బీద రవిచంద్ర, నియోజకవర్గ పరిశీలకుడు మబ్బు దేవనారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందే ‘థామ్‌సను అధిష్ఠానం ఇన్‌చార్జిగా నియమించిన నేపథ్యంలో కో-ఆర్డినేటర్‌గా భీమినేని చిట్టిబాబు వద్దు’ అని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్లు మాజీమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ఉండి ఈ విషయాన్ని గమనించిన చిట్టిబాబు సమావేశం ప్రారంభం కాకముందే అలిగి వెళ్లిపోయారు. దీనిపై చిట్టిబాబు అనుచరులు టీడీపీ జిందాబాద్, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి, చిట్టిబాబును కొనసాగించాలి.. అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ.. చిట్టిబాబుకు అధిష్ఠానం సూచన మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. థామస్ మాట్లాడుతూ.. అందరం కలిసి మాట్లాడుకుని పార్టీ విజయం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వర్షం అధికం కావడంతో సమీక్ష వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగరి ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ తదితరులు పాల్గొన్నారు.