అద్దె అడిగేదెవరు?
ABN , First Publish Date - 2023-12-11T01:15:11+05:30 IST
రుయాస్పత్రి ఆవరణలోని దుకాణాలన్నీ ఖాళీ చేయించి తమ అనుచరులకు నామ మాత్రపు అద్దెలకు అధికార పార్టీ నేతలు కట్టబెట్టేశారు.
రుయాస్పత్రి ఆవరణలో అధికార పార్టీ నేతల అనుచరులకు అడ్డాగా మారిన దుకాణాలు
తిరుపతి సిటీ: రుయాస్పత్రి ఆవరణలో చిన్న బడ్డీ బంకు పెట్టుకోవాలన్నా లక్షల రూపాయల్లో అద్దె చెల్లించడానికి కూడా వ్యాపారులు వెనుకాడరు. ఎందుకంటే ఇక్కడ రాత్రీపగలు తేడా లేకుండా ఆ స్థాయిలో వ్యాపారం జరుగుతుంటుంది. ఇంకేముంది అధికార పార్టీ నేతలు ఈ దుకాణాలపై కన్నేశారు. రెండేళ్ల కిందట ఉన్నఫలంగా దుకాణాలన్నీ ఖాళీ చేయించి తమ అనుచరులకు నామ మాత్రపు అద్దెలకు కట్టబెట్టేశారు. సరే ఆ అద్దెలన్నా వారు సక్రమంగా చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు. లక్షలకు లక్షల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దుకాణాల్లోనూ నిబంధనలూ పాతరేశారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో ఇటీవల కొందరు అధికారులు అద్దె బకాయిలు చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. వెంటనే అధికార పార్టీ ముఖ్య నేత నుంచి.. ‘ఆ షాప్‌లు మన వాళ్లవే.. అద్దె నిదానంగా ఇస్తారు.. ఇచ్చినప్పుడు తీసుకోండి.. అప్పటి వరకు అద్దె అడిగి మనోళ్లని ఇబ్బంది పెట్టొద్దు’ అనే ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు ఏం చేయాలో పాలుపోక.. రికార్డుల్లో ఏమని నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
బర్న్స్ వార్డు ముందున్న క్యాంటీన్
నెలకు రూ.15లక్షలకుపైగా వ్యాపారం.
రూ.32వేల అద్దెకే ఇచ్చేశారు.
22 నెలలుగా సుమారు రూ.7లక్షలకుపైగా అద్దె బకాయి ఉంది.
అద్దె బకాయిలపై గతంలో సూపరింటెండెంట్ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. మరోవైపు కరెంటు, నీటి బిల్లులూ చెల్లించలేదు. దీనికితోడు నిబంధనలకు విరుద్ధంగా ఈ క్యాంటీన్ ముందు రోడ్డుకు అడ్డంగా టీ, టెంకాయల దుకాణాలు కూడా అదనంగా ఏర్పాటు చేశారు. వీటితో రోడ్డుపై అంబులెన్సులు తిరగడానికీ ఇబ్బందులు వస్తున్నాయి. క్యాంటీన్ నుంచి వచ్చే మురుగును బహిరంగంగానే వదిలేస్తుండటంతో ఈ మార్గాన వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.
ఏక్లాస్ వార్డుల నడుమ క్యాంటీన్
నెలకు దాదాపు
రూ.10-12 లక్షలకుపైగా వ్యాపారం.
రూ. 21వేల అద్దెకే కేటాయించారు.
15 నెలలుగా రూ.3.15 లక్షల అద్దె బకాయిలున్నాయి.
అద్దె బకాయిల కోసం నిర్వాహకుడి కాళ్లావేళ్లా పడి అధికారులు ప్రాధేయపడితే తప్ప అరకొర చెల్లించే పరిస్థితి లేదు. విద్యుత్తు, నీటి బిల్లుల సంగతి సరేసరి. దీనికితోడు ఈ క్యాంటీన్ నుంచి వచ్చే మురుగను కూడా బహిరంగంగానే వదిలేశారు. దీనివల్ల దుర్గంధంతోపాటు దోమలు పెరిగి, సమీప వార్డుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పోలీస్ అవుట్ పోస్టు పక్కన షాపింగ్ కాంప్లెక్సులోని దుకాణం
నెలకు రూ. 10 లక్షలకుపైగా వ్యాపారం.
రూ.10 వేల అద్దెకే కేటాయించారు.
20 నెలలుగా రూ.2 లక్షలకుపైగా అద్దె బకాయిలున్నాయి.
ఇక్కడ కేవలం ఓ చిన్నపాటి టీ దుకాణానికి అనుమతి ఉన్నా భారీ స్థాయిలో పెద్ద సూపర్ మార్కెట్‌నే ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. దీనికితోడు ఇక్కడ లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతం కాలం చెల్లినవి, నాణ్యత లేనివే విక్రయిస్తారన్న విమర్శలున్నాయి.