తాజాగా పట్టుబడింది ఏ చిరుత?
ABN , First Publish Date - 2023-08-30T02:09:35+05:30 IST
తిరుమల నడకమార్గంలో ఆదివారం రాత్రి బోనులో చిక్కింది ఏ చిరుత? నాలుగవదా లేక మొదటిదే తిరిగి పట్టుబడిందా? చిన్నారులు కౌశిక్, లక్షితలపై దాడులు చేసింది ఒకటే చిరుతా లేక వేర్వేరువా? లక్షిత ఘటనలో సేకరించిన డీఎన్‌ఏ నమూనాలను పట్టుబడిన చిరుతల డీఎన్‌ఏలతో సరిపోల్చి చూడడానికి ఎంత వ్యవధి పడుతుంది?
-నాలుగోదా? మొదటిదే తిరిగి దొరికిందా?
తిరుమల నడకమార్గంలో ఆదివారం రాత్రి బోనులో చిక్కింది ఏ చిరుత? నాలుగవదా లేక మొదటిదే తిరిగి పట్టుబడిందా? చిన్నారులు కౌశిక్, లక్షితలపై దాడులు చేసింది ఒకటే చిరుతా లేక వేర్వేరువా? లక్షిత ఘటనలో సేకరించిన డీఎన్‌ఏ నమూనాలను పట్టుబడిన చిరుతల డీఎన్‌ఏలతో సరిపోల్చి చూడడానికి ఎంత వ్యవధి పడుతుంది? 526 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన శేషాచలం అభయారణ్యంలో 50కి పైగా చిరుతలు వున్నట్టు అటవీ శాఖ ఉన్నతాధికారులే భావిస్తున్న నేపధ్యంలో ఈ చిరుతల ఆపరేషన్ ముగిసేది ఎన్నటికి? నడక దారిలో ఇంకా ఎంతకాలం అభద్రత, ఆంక్షల నడుమ రాకపోకలు సాగించాలి? ఇతర శాశ్వత ప్రత్యామ్నాయాలేమీ లేవా? సమాధానం దొరకని ఈ ప్రశ్నలతో భక్తులు ఆందోళనకు, అయోమయానికి గురవుతున్నారు.
తిరుపతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): అలిపిరి నడక దారిలో ఈ ఏడాది జూన్ 22, ఈనెల 11వ తేదీ చిన్నారులు కౌశిక్, లక్షితలపై జరిగిన దాడుల నేపధ్యంలో ఏర్పాటు చేసిన బోనుల్లో ఇప్పటి వరకూ నాలుగు చిరుతలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పట్టుబడిన చిరుత సంఖ్య రీత్యా ఎన్నోది అనే ప్రశ్న తలెత్తుతోంది. తొలుత పట్టుబడిన చిరుతను అటవీ అధికారులు అత్యంత సమీపంలోనే విడిచిపెట్టేయగా రెండవసారి, మూడవసారి పట్టుబడ్డ చిరుతలను జూపార్కులో వుంచారు. మొదటి చిరుతను విడిచిపెట్టేసిన నేపధ్యంలో అదే తిరిగి ఎందుకు పట్టుబడి వుండకూడదన్న ప్రశ్న వినిపిస్తోంది. రెండవ సారి గానీ మూడవ సారి గానీ లేదా తాజాగా పట్టుబడిన చిరుతల్లో గానీ అది ఎందుకు ఒకటి అయివుండకూడదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకూ పట్టుబడిన నాలుగు చిరుతలూ మగవేనని అధికారులు చెబుతున్నారు. మొదటి మూడు పులులూ రెండు నుంచీ మూడేళ్ళ లోపు వయసు కలిగి వున్నాయని, చివరగా దొరికిన నాలుగోది మాత్రం ఐదారేళ్ళ వయసు కలిగి వుందని చెబుతున్నారు.
చిన్నారులపై దాడి చేసింది ఒకటే చిరుతా?
చిన్నారులు కౌశిక్, లక్షిత చిరుతల దాడులకు గురయ్యారు. వీరిలో కౌశిక్ బతికి బయటపడగా లక్షిత మాత్రం ప్రాణాలు కోల్పోయింది. వీరిపై దాడి చేసింది ఒకటే చిరుతా? లేక వేర్వేరు చిరుతలా? అన్న సందేహాలు ఇంతవరకూ నివృత్తి కాలేదు. బహుశా ఎప్పటికీ కాకపోవచ్చు కూడా. చిరుత దాడిలో కౌశిక్ గాయపడ్డాడు. అయితే అప్పట్లో కౌశిక్ గాయాల నుంచీ రక్త నమూనాలు గానీ, ఆ చిన్నారి దొరికిన ప్రదేశం నుంచీ దాడి చేసిన జంతువుకు సంబంధించిన ఆనవాళ్ళు, ఆధారాలు గానీ సేకరించలేదు. దానికి తోడు కౌశిక్‌పై దాడి తర్వాత రోజే ఓ చిరుత బోనులో చిక్కింది. కనీసం దాని డీఎన్‌ఏ నమూనాలు కూడా అధికారులు సేకరించకుండానే సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేశారు. అందువల్ల కౌశిక్‌పై దాడి చేసిన చిరుత ఫలానా అని గుర్తించే వీల్లేకుండా పోయింది.
లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేదెప్పుడు?
లక్షితపై దాడి చేసి హతమార్చిన చిరుతను ఎప్పటికి గుర్తిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అయితే కొంత ఆలస్యంగానైనా చిరుతను గుర్తించడానికి అవకాశం వుంది. లక్షిత మృతదేహం నుంచీ డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు.అలాగే మృతదేహం పడివున్న చోట లభించిన జంతువుకు సంబంధించిన నమూనాలు కూడా సేకరించారు. రెండవ సారి, మూడవసారి పట్టుబడిన చిరుతల రక్త నమూనాలు కూడా సేకరించారు. వీటన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. లక్షిత మృతదేహం నుంచీ, ఆ పరిసరాల నుంచీ సేకరించిన నమూనాలను పట్టుబడిన రెండు చిరుతల డీఎన్‌ఏ నమూనాలతో సరిపోల్చాల్సి వుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. వీటి ఫలితాలు వెల్లడి కావడానికి ఇంకో వారం రోజులు పడుతుందని సమాచారం. అలాగే ఆదివారం రాత్రి పట్టుబడిన చిరుత నమూనాలను కూడా సేకరిస్తున్నారు. దీని ఫలితం రావడానికి పదిహేను రోజులు పట్టనుంది. ఇపుడు పట్టుబడిన మూడు చిరుతల్లో లక్షితపై దాడి చేసిన చిరుత వుంటే దాన్ని జూపార్కులోనే వుంచి మిగిలిన వాటిని తిరిగి అడవుల్లో వదిలేస్తారు. ఒకవేళ వాటిలో దాడి చేసిన చిరుత కనుక లేకుంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఎందుకంటే లక్షితపై దాడి చేసిన చిరుతను మ్యానీటర్‌గానే పరిగణించాల్సి వుంది. అది ప్రమాదకారిగా మారుతుంది.
శేషాచలం అడవుల్లో 50కి పైగా చిరుతలు?
శేషాచలం అడవుల్లో చిరుతల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే 50కి పైగానే వుంటాయన్న అంచనా మాత్రం వుంది. 526 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ అభయారణ్యంలో 2018 నాటికే 35 దాకా చిరుతలు వున్నట్టు అధికారులు అనధికారిక సంభాషణల్లో వెల్లడించారు. ఇప్పుడు వాటి సంఖ్య 50 దాటి వుంటుందని భావిస్తున్నారు. కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాకపోకలు నిలిపివేసిన కాలంలో ఒకే సారి 11 చిరుతలు గుంపుగా ఘాట్‌రోడ్డులో సంచరించిన దృశ్యాలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చిరుతలు రోజుకు కిలోమీటరు నుంచీ పాతిక కిలోమీటర్ల దాకా సంచరిస్తాయి. వాటి సగటు జీవితకాలం 12 ఏళ్ళు. కొన్ని వయసు మీరి, మరికొన్ని వేటాడే క్రమంలో గాయపడి, లేదా ఘర్షణల్లో గాయాలకు లోనై, లేదా అనారోగ్యాలతో మరణిస్తూ వుంటాయి. కొన్ని ఇతర ప్రాంతాలకు వెళితే మరికొన్ని కొత్తవి ఇక్కడికి వస్తూ వుంటాయి. చిరుతల రాకపోకలు నిరంతరం సాగేవే. దీనికి ఒక ముగింపు అంటూ వుండదు. అందువల్లే అటవీ అధికారులు అదనంగా కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేయడానికి 200 కెమెరాలు కొనుగోలు చేస్తున్నారు. వీటిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కౌశిక్, లక్షితలపై దాడి చేసిన చిరుత పట్టుబడితే సమస్య తీరుతుందన్నది వారి భావన.దాడి చేయడానికి అలవాటు పడిన దాన్ని జూపార్కులో నిర్బంధిస్తే సరిపోతుందని, మిగిలిన చిరుతల వల్ల పెద్దగా ప్రమాదం వుండదని వారు అభిప్రాయపడుతున్నారు.వారి అంచనా ఎంతవరకూ కరెక్టన్నది కాలమే నిర్ణయించాల్సి వుంది.
ఎలుగుబంటి సంగతేమిటో!
చిరుతల సంగతి పక్కన పెడితే ఎలుగుబంట్లు కూడా తరచూ ఘాట్ రోడ్డులో, నడక దారుల్లో కనిపిస్తూనే వున్నాయి.ఇప్పటి వరకూ వాటితో ప్రమాదం లేకపోయినా ముందు ముందు ఎలా వుంటుందో తెలియదు. మామూలుగానే దూకుడుగా వుండే ఈ జంతువులు జూలై-సెప్టెంబరు నడుమ జతకడతాయని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో మరింత కోపంగా వుంటాయని, ఇక పిల్లలున్న ఎలుగులు అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. వీటిని కూడా ఏదో ఒక స్థాయిలో నియంత్రించాల్సి వుంటుంది. మొత్తానికి ఈ గండాలన్నీ ఎప్పుడు గట్టెక్కుతాయో, ఎప్పుడు ఆంక్షలు లేకుండా, నిర్భయంగా శ్రీవారి దర్శనానికి నడక దారిలో రాకపోకలు సాగిస్తామో తెలియక భక్తులు అయోమయానికి లోనవుతున్నారు.