ఇచ్చిన మాట ఏమైంది జగన్?
ABN , First Publish Date - 2023-11-21T02:51:04+05:30 IST
చిత్తూరు డెయిరీ.. పాడి రైతులకు బోనస్ విషయంలో చెప్పిన మాట ఏమైందంటూ జగన్‌ను ప్రశ్నిస్తూ కార్మికులు, రైతు నాయకుడు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేశారు.

చిత్తూరు, నవంబరు 20: మాట తప్పను.. మడమ తిప్పను- ఇదీ సీఎం జగన్ పదే పదే చెప్పే డైలాగు. అమల్లో మాత్రం ఎన్నో మాటలు తప్పారు. పలుమార్లు మడమ తిప్పారు. ఈ క్రమంలో.. చిత్తూరు డెయిరీ.. పాడి రైతులకు బోనస్ విషయంలో చెప్పిన మాట ఏమైందంటూ జగన్‌ను ప్రశ్నిస్తూ కార్మికులు, రైతు నాయకుడు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేశారు. విజయా డెయిరీని అమూల్ సంస్థకు అప్పగించాక.. భూమి పూజ కోసం సీఎం జగన్ చిత్తూరుకు వచ్చారు. కార్మికుల పెండింగ్ జీతాలను విడుదల చేస్తామని చెప్పారు. ఆ మాట నెరవేరలేదు. దీనిపై అధికారులూ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో పెండింగ్ జీతాల కోసంకలెక్టరేట్ వద్ద డెయిరీ కార్మికులు చేపట్టిన రిలేదీక్షలు సోమవారానికి 69వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ‘2002 ఆగస్టు 21న ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను బయటకు గెంటేశారు. ఇప్పటి వరకు కార్మికులకు ఎలాంటి వేతనాలు చెల్లించకుండా గాలికొదిలేశారు. పాదయాత్రలో డెయిరీని తెరిపించి కార్మికులకు ఉద్యోగవకాశాలను కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. డెయిరీ పునరుద్ధరణ కాకుండా, అమూల్‌కు లీజుకు ఇచ్చారు. భూమిపూజ కోసం వచ్చినప్పుడు కార్మికుల పెండింగ్ జీతాలను ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 69 రోజులు గడిచినా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు ఇచ్చేవరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
పాడి రైతులకు బోనస్ ఎప్పుడిస్తారు?
పాడి రైతులకు లీటరుపై రూ.4 బోనస్ ఇస్తామని ఇచ్చిన మాట ఏమైందంటూ సీఎం జగన్‌ను రైతు నాయకుడు, శాంతియుత ఉద్యమ నేత ఈదల వెంకటాచలం నాయుడు ప్రశ్నించారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారంటూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆయన నిరసన తెలిపారు. ‘గతంలో మూతపడిన డెయిరీని, గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీలను వైసీపీ అధికారంలోకి రాగానే తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అమూల్‌కు విజయా డెయిరీని అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ఇలా రైతులు, కార్మికులను మోసం చేసిన సీఎం జగన్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’ అని ఆయన హెచ్చరించారు. దీక్ష చేస్తున్న ఆయన్ను పోలీసులు పైకి లేపి కలెక్టరేట్ గేటు బయట వదిలారు.