క్రిస్మస్ తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
ABN , Publish Date - Dec 24 , 2023 | 01:47 AM
తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే క్రిస్మస్ తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు చేపట్టిన సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది.
- కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన
చిత్తూరు, డిసెంబరు 23: తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే క్రిస్మస్ తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు చేపట్టిన సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలుచోట్ల పొర్లుదండాలు పెట్టి, గోవింద నామ స్మరణలు చేయగా, మరికొన్నిచోట్ల మానవహారం నిర్వహించారు. ఫచిత్తూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు పొర్లుదండాలు పెట్టి సమస్యలు పరిష్కరించేలా చూడాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, జిల్లా అధ్యక్షురాలు సుజని మాట్లాడుతూ 12 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే క్రిస్మస్ తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. యూనియన్ నేతలు ప్రభావతి, బుజ్జి, అరుణ, సునీత, తదితరులు పాల్గొన్నారు. ఫ కుప్పంలో అంగన్వాడీలు ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ పలమనేరులో అంగన్వాడీలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఫ పుంగనూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలతో కలిసి గోవిందనామ స్మరణలు చేశారు. ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. ఫ కార్వేటినగరంలో అంగన్వాడీలు మెడలో పూలమాలలు ధరించి గోవింద నామ స్మరణలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని వేడుకున్నారు.