క్వారీలు కావాలా.. విజయపురం రండి!

ABN , First Publish Date - 2023-08-26T01:16:34+05:30 IST

అధికార పార్టీ అండదండలతో విజయపురం మండలంలో మట్టి క్వారీలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లాకు మారుమూలన.. తమిళనాడుకు సరిహద్దున ఉండే ఈ మండలంలో 35 మట్టి క్వారీలకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

క్వారీలు కావాలా.. విజయపురం రండి!
మట్టి తరలింపునకు గుట్ట పక్కన వేసిన రోడ్డు

మీకు మట్టి క్వారీలు కావాలా? అయితే విజయపురం రండి. అధికార పార్టీ అండదండలుండి.. దరఖాస్తు చేసుకుంటే చాలు. వెంటనే అనుమతులు వచ్చేస్తాయి. కొండలు, గుట్టలు తవ్వి లోడ్లకొద్దీ మట్టిని ఎక్కడికైనా తరలించి సొమ్ము చేసుకోవచ్చు.

- నగరి

అధికార పార్టీ అండదండలతో విజయపురం మండలంలో మట్టి క్వారీలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లాకు మారుమూలన.. తమిళనాడుకు సరిహద్దున ఉండే ఈ మండలంలో 35 మట్టి క్వారీలకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 20 క్వారీలకుపైగానే మట్టి తరలించారు. సత్యవేడు నియోజకవర్గానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత సాయంతో తమకు అనుకూలమైన చోట క్వారీలకు అనుమతులు తీసుకుని ఇష్టానుసారంగా పరిమితికి మించి మట్టిని తవ్వి తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. విజయపురం మండలంలోని మహారాజపురం పంచాయతీలో 5వ విడత భూ పంపిణీలో దళితులకు రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాలు పంపిణీ చేసింది. ఆ భూముల్లోనూ క్వారీలకు అనుమతులు లభిస్తున్నాయంటే అధికార పార్టీ అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పొచ్చు. దళితుల జీవనాధారణ కోసం నాటి ప్రభుత్వం డీకేటీ భూములను పంపిణీ చేసింది. పట్టాలు పొందిన లబ్ధిదారులకు తమ భూములు ఎక్కడున్నాయో ఇప్పటికి తెలియకపోవడం గమనార్హం. క్వారీలకు అనుమతి పొంది మట్టి తరలించే వారు మాత్రం ఆ భూములు ఎవరెవరివో తెలుసుకుని వారి వద్ద ఆ భూమిని అగ్రిమెంట్‌ రూపంలో రాసుకుని క్వారీలకు అనుమతులు పొందుతున్నారు. తాత్కాలికంగా క్వారీలకు లైసెన్సులు పొంది తమ ఇష్టానుసారం మట్టిని తరలించడంలో పోటీ పడుతున్నారు. తమిళనాడుకు సరిహద్దున ఉండటంతో మట్టికి మంచి గిరాకీ ఉంది. ఇటు తమిళనాడు క్వారీ పేరు మీద అనుమతులు పొంది ఎవరంటే వారు మట్టిని తరలించుకోగలుగుతున్నారు. మహారాజపురం పంచాయతీ పరిధిలో 187/12 సర్వే నెంబరులో తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు గుమ్మడిపూడి నివాసి శ్రీహరి ఎంటైర్‌ ప్రైజస్‌ పేరు మీద తాత్కాలికంగా అనుమతులు పొంది మట్టిని తరలించడానికి రోడ్డు వేసి తరలిస్తున్నారు. శ్రీహరిపురం ఎస్టీ కాలనీ నివాసుల మీదుగా ఈ వాహనాలు వెళుతున్నాయి. విజయపురం మండలంలో డీకేటీ భూములు అధికంగా ఉండడంతో ఎక్కడెక్కడి వారో ఇక్కడ క్వారీలకు అనుమతులు పొంది తమ ఇష్టానుసారం మట్టిని తరలించి కొండలు కరిగిస్తున్నారు.

దేశంలో ఎవరికైనా క్వారీలు ఇవ్వొచ్చు

భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారికైనా.. ఎక్కడైనా క్వారీలకు అనుమతి ఇవ్వచ్చు. స్థానిక రెవెన్యూ అధికారుల రిపోర్టు మేరకు వ్యవసాయానికి అనుకూలం కాని భూములైతే క్వారీలకు అనుమతిస్తాం.

- రమణారెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, గనులశాఖ, చిత్తూరు

Updated Date - 2023-08-26T01:16:34+05:30 IST