TTD: భక్తులకు శుభవార్త.. ‘గోవింద కోటి’ రాసిన వారికి వీఐపీ దర్శనం

ABN , First Publish Date - 2023-09-06T02:56:14+05:30 IST

యువతలో భక్తిభావన పెంచేందుకు, హైందవ సనాతన ధర్మం విస్తృతంగా ప్రచారం చేసేందుకు రామకోటి తరహాలో ‘గోవింద కోటి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి తెలిపారు.

TTD: భక్తులకు శుభవార్త.. ‘గోవింద కోటి’ రాసిన వారికి వీఐపీ దర్శనం

ఎల్‌కేజీ నుంచి పీజీ విద్యార్థుల దాకా కోటి భగవద్గీత పుస్తకాల పంపిణీ

రూ.600 కోట్లతో రెండు వసతి భవనాల నిర్మాణం

నేటి నుంచి నడకదారి భక్తులకు చేతికర్రల పంపిణీ

టీటీడీ బోర్డు నిర్ణయాలు

తిరుమల, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): యువతలో భక్తిభావన పెంచేందుకు, హైందవ సనాతన ధర్మం విస్తృతంగా ప్రచారం చేసేందుకు రామకోటి తరహాలో ‘గోవింద కోటి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే గోవిందకోటి రాసిన 25 ఏళ్లలోపు పిల్లలకు, యువతకు, వారి కుటుంబ సభ్యులకు ఒకసారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 10,01,116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి దర్శనభాగ్యాన్ని కల్పిస్తామన్నారు. టీటీడీ నూతన ధర్మకర్తల మండలి మంగళవారం తొలి సమావేశాన్ని నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ మీడియాకు వివరించారు. తిరుపతిలో అతి పురాతనమైన 2, 3 సత్రాల స్థానంలో రూ.600 కోట్లతో రెండు నూతన వసతి భవనాలను నిర్మిస్తామన్నారు. ఒకదానికి అచ్యుతం, మరోదానికి శ్రీపథం అనే పేర్లు పెడతామన్నారు. వీటి ద్వారా దాదాపు 20 వేల మందికి వసతి కల్పించవచ్చని వివరించారు. సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ఎల్‌కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా 20 పేజీల భగవద్గీత సారాన్ని తెలిపే కోటి పుస్తకాలు అందజేస్తామన్నారు. ముంబైలోని బాంద్రాలో రూ.5.35 కోట్లతో టీటీడీ సమాచార కేంద్రం, రూ.1.65 కోట్లతో శ్రీవారి రెండవ ఆలయ నిర్మాణం ఏర్పాటుకు బోర్డు సభ్యులే ముందుకు రాగా ఆమోదించామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ధర్మగిరి, కీసరగుట్ట, కోటప్పకొండ, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ ప్రాంతాల్లో నడుస్తున్న వేదవిజ్ఞానపీఠాల్లో 47 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామన్నారు. టీటీడీ ఆలయాల్లో 413మంది అర్చకులు, పరిచారకులు, పోటు కార్మికులు, ప్రసాద పంపిణీదారుల పోస్టుల భర్తీకి ఆమోదించి అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ పంపుతామన్నారు. తిరుమలకు నడక మార్గాన వచ్చే భక్తుల రక్షణ కోసం చేతి కర్రల పంపిణీని బుధవారం నుంచి ప్రారంభిస్తామన్నారు. భక్తులకు అందజేసే కర్రలను తిరిగి ఎన్‌ఎస్‌ టెంపుల్‌ వద్ద సేకరిస్తామన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నడకమార్గాల్లో అంక్షలు కొనసాగుతాయన్నారు.

ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాం: టీటీడీ చైర్మన్‌

నాతన ధర్మంపై తమిళనాడులో మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని టీటీడీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి అన్నారు. రాజకీయపరమైన విమర్శ కావడంతో బోర్డులో తీర్మానం చేయ లేం కానీ బోర్డు అధ్యక్షుడిగా, రాజకీయనాయకుడిగా, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా తాను ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ‘సనాతన ధర్మం అంటే మతం కాదు... సనాతన ధర్మం అంటే ఒక జీవనయానం. ప్రతి దేశానికీ ఒక సంప్రదాయం, సంస్కృతి ఉంటుంది. వాటిని అర్థం చేసుకోకుండా, చదువుకోకుండా కులవ్యవస్థ ఆలోచనలతో చూస్తూ సనాతన ధర్మమంతా హేతుబద్ధమైనది కాదని, సంఘ వ్యతిరేకమైనదనే భ్రమలో, దురుద్దేశంతో చేసే విమర్శలు సమాజంలో అలజడి సృష్టించడానికి పనికొస్తాయి తప్ప విమర్శలు చేసిన వారికి కూడా ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉండవు’ అన్నారు.

Updated Date - 2023-09-06T10:15:07+05:30 IST