Share News

కాణిపాకంలో వైభవంగా వరసిద్ధుడి కల్యాణం

ABN , First Publish Date - 2023-12-11T00:40:29+05:30 IST

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం కాణిపాక వరసిద్ధుడుకి కల్యాణోత్సవం నిర్వహించారు.

కాణిపాకంలో వైభవంగా వరసిద్ధుడి కల్యాణం
హోమం నిర్వహిస్తున్న అర్చక, పండితులు

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 10: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం కాణిపాక వరసిద్ధుడుకి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో మూల విరాట్‌కు ఉదయం అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ మాజీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద కల్యాణ వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల ఘోష నడుమ వరసిద్ధుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి కల్యాణాన్ని వీక్షించడానికి వందలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాపాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తిన భక్తులు

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు, దీంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. కార్తీక మాసం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయం క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండి పోయాయి. అధిక రద్దీ కావడంతో క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2023-12-11T00:40:30+05:30 IST