వజ్రకవచధర మలయప్ప

ABN , First Publish Date - 2023-06-03T01:41:02+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.

వజ్రకవచధర మలయప్ప

తిరుమల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వజ్రకవచాన్ని ధరింపజేశారు. సహస్రదీపాలంకరణలో స్వామివారు వజ్రకవచ అందాలతో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాడవీధుల్లో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్యాలరీల్లోని భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. కాగా.. ఉదయం రుత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990లో జ్యేష్ఠాభిషేకం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యుడు మారుతి ప్రసాద్‌, డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. శనివారం ముత్యపుకవచం, ఆదివారం స్వర్ణకవచంతో శ్రీవారు దర్శనమిస్తారు.

Updated Date - 2023-06-03T01:41:02+05:30 IST