అనధికార విద్యుత్‌ కోతలు

ABN , First Publish Date - 2023-08-22T01:36:36+05:30 IST

జిల్లావ్యాప్తంగా సోమవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. రెండు నుంచి నాలుగు గంటల పాటు సరఫరా ఆగిపోయింది.

అనధికార విద్యుత్‌ కోతలు

ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో..!

- 2 నుంచి 4 గంటలు ఆగిన సరఫరా - పునరుద్ధరించాక కూడా అంతరాయాలు

తిరుపతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సోమవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. రెండు నుంచి నాలుగు గంటల పాటు సరఫరా ఆగిపోయింది. సరఫరా పునరుద్ధరించాక కూడా పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అత్యధిక మండలాల్లో సాయంత్రం చీకటి పడే సమయం నుంచి రాత్రి 8-9 గంటల నడుమ సరఫరా ఆగిపోయింది. దాంతో జనం తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఆరా తీస్తే ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరిట ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అనధికారికంగా విద్యుత్‌ కోతలు విధించినట్టు తెలిసింది. ఈ విషయం అధికారికంగా వెల్లడించడానికి ఎస్పీడీసీఎల్‌ అధికారులు నిరాకరించారు.

చీకటిమయంగా పల్లెలు

తిరుపతితోపాటు ప్రధాన పట్టణాలను విడిచి మండల కేంద్రాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా బంద్‌ కావడంతో పల్లెలన్నీ చీకటిమయమయ్యాయి. ఉదాహరణకు దొరవారిసత్రం మండలంలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.13 గంటలదాకా సరఫరా ఆపేశారు. జనం విద్యుత్‌ సిబ్బందిని అడిగితే మెయిన్‌ సప్లయ్‌ పోయిందని చెప్పారు. తడ మండలంలోనూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలదాకా సరఫరా నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించినా తొమ్మిది గంటలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. సూళ్లూరుపేట మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలదాకా సరఫరా ఆగింది. మళ్లీ రాత్రి ఏడు నుంచి 7.30 గంటలదాకా లేదు. తర్వాత రాత్రి 8.30 నుంచి ఆపేశారు. కేవీబీపురంలో సాయంత్రం ఆరు నుంచి రాత్రి 7.40 గంటలదాకా విద్యుత్‌ సరఫరా లేదు. వరదయ్యపాళెం మండలంలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.10 గంటల దాకా సరఫరా లేదు. ఏర్పేడు మండలంలో సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది దాకా సరఫరా ఆగింది. తర్వాత పునరుద్ధరించినా తిరిగి 9.12 గంటల నుంచి ఆగిపోయింది. వాకాడు మండలంలో రాత్రి 7.30 నుంచి 8.10 దాకా అంతరాయం కలిగింది. సరఫరా ఇవ్వడం, ఆపడం ఇలా పదేపదే జరిగింది. కోట మండలంలోని కోట, విద్యానగర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 6.30 నుంచి 7.10 దాకా సరఫరా నిలిపేశారు. తర్వాత పునరుద్ధరించాక వెంటవెంటనే అంతరాయం కలిగింది. బాలాయపల్లి మండలంలో సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా సరఫరా ఆగింది. ఆపై సరఫరా చేసినా తిరిగి 8.30 గంటలకు మళ్లీ ఆపేశారు. వడమాలపేట మండలంలో సాయంత్రం 6-8 గంటల మధ్య పోయింది. పాకాల మండలంలో పగలు మూడుసార్లు అంతరాయం ఏర్పడింది. అరగంట, గంట చొప్పున సరఫరా ఆగింది. సాయంత్రం ఆరు నుంచి 8 గంటల దాకా ఆపేశారు. చిన్నగొట్టిగల్లు మండలంలో సైతం సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది దాకా లేదు. నాయుడుపేట పిచ్చిరెడ్డితోపు ప్రాంతంలో 20 నిమిషాల సరఫరా ఆగింది.

సాయంత్రం తర్వాతే..

ఇదివరకు ప్రతి సబ్‌ స్టేషన్‌ పరిధిలో ముందుగానే విద్యుత్‌ కోతల వేళలు ప్రకటించేవారు. దీనికి తగ్గట్టు గ్రామీణ ప్రాంత ప్రజలు సంసిద్ధమై ఉండేవారు. ఇపుడు విద్యుత్‌ కోతలు, అంతరాయాలన్నీ అనధికారికంగానే.. అదీ సాయంత్రం తర్వాతే అమలవుతున్నాయి. పైగా గ్రామాలతోపాటు మండల కేంద్రాలకు కూడా కోతలు, అంతరాయాలు వ్యాపించాయి. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8-9 గంటల దాకా సరఫరా నిలిపివేస్తున్నందున ఇళ్లు, వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి. ఈ సమయంలోనే పిల్లల చదువులైనా, టీవీ సీరియల్స్‌ వీక్షించడమైనా, భోజనాలు వంటివి చేయడమైనా జరుగుతాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే విద్యుత్‌ సరఫరాకు బ్రేక్‌ పడుతుండడంతో జనం దుమ్మెత్తిపోసే పరిస్థితి.

వినియోగం పెరిగినందునే..

వేసవి ముగిసి యాభై రోజులు గడుస్తోంది. అయితే ఇప్పటికీ జిల్లాలో వేసవి వాతావరణమే కొనసాగుతోంది. పగలు చుర్రుమనేలా ఎండలు కాస్తున్నాయి. పగలు, రాత్రీ తేడా లేకుండా వాతావరణం వేడిగా ఉంటోంది. వేడిమి, ఉక్కపోతల కారణంగా ఇప్పటికీ జిల్లాలో ఏసీల వాడకం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అనధికారిక కోతలు విధించని పక్షంలో లోడ్‌ పెరిగిపోయి ఏకంగా గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉందని ఎస్పీడీసీఎల్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రమాదం తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో అనధికారిక కోతలు విధించాల్సి వస్తోందంటున్నాయి. రోజువారీ విద్యుత్‌ వినియోగం వేసవికి మునుపటి స్థాయికి తగ్గేవరకూ ఈపరిస్థితి తప్పదని స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - 2023-08-22T01:36:36+05:30 IST