ఓటరు జాబితాపై వారానికి రెండుసార్లు సమావేశం
ABN , First Publish Date - 2023-07-21T02:18:07+05:30 IST
తప్పుల్లేని ఓటరు జాబితా తయారీకోసం ఇకపై ప్రతి మంగళవారం నియోజకవర్గ స్థాయిలో, ప్రతి బుధవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 20: తప్పుల్లేని ఓటరు జాబితా తయారీకోసం ఇకపై ప్రతి మంగళవారం నియోజకవర్గ స్థాయిలో, ప్రతి బుధవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ పార్టీల ప్రతినిధులతో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ఓటరు జాబితా ప్రధాన భూమిక వహిస్తుందన్నారు. పారదర్శకంగా జాబితా తయారీకి రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు నమోదు, మార్పులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయన్నారు. పేర్ల తొలగింపులు, చేర్పులు చేసిన జాబితాను ప్రతి శనివారం సచివాలయ నోటీసు బోర్డులో ఉంచుతామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోల నియామకాలు జరిగాయన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి ఓటరు జాబితా సవరణ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో డీఆర్వో రాజశేఖర్, పార్టీల ప్రతినిధులు సురేంద్రకుమార్ (టీడీపీ), ఉదయ్ కుమార్ (వైసీపీ), చిట్టిబాబు (బీజేపీ), పరదేశి (కాంగ్రెస్), కుమారస్వామి (బీఎస్పీ), గంగరాజు (సీపీఎం), ఎన్నికల విభాగ తహసీల్దార్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు.
రోజుకు 40 ఇళ్ల సర్వే తప్పనిసరి
శుక్రవారం నుంచి నెలరోజుల పాటు జరుగనున్న ఓటరు జాబితా సర్వేలో బీఎల్వోలు కొత్త యాప్ ద్వారా ప్రతిరోజూ 40 ఇళ్ల సర్వే చేయాలని కలెక్టర్ షన్మోహన్ అన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ నుంచి ఆయన తహసీల్దార్లు, బీఎల్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల పేర్లు తొలగించేందుకు ముందు వారి కుటుంబ సభ్యులతో పాటు పంచనామా నిర్వహించాలన్నారు. మృతుల క్లెయిమ్‌లు రెండు శాతం, మార్పులు - చేర్పులైతే నాలుగు శాతం మించరాదన్నారు. ఒకే ఇంట్లో పదిమందికి మించి ఓటర్లు ఉంటే స్థానిక ఎన్నికల అధికారి స్వయంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.