TTD Fake websites: శ్రీవారి భక్తులే టార్గెట్‌!

ABN , First Publish Date - 2023-04-17T02:35:35+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి, కొండపై వసతికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు కేటుగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. దర్శనం, గదుల కోసం ఇంటర్నెట్‌లో వెతికే వారిని టార్గెట్‌ చేసుకుని దోచేస్తున్నారు.

TTD Fake websites: శ్రీవారి భక్తులే   టార్గెట్‌!

టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ల హల్‌చల్‌

దర్శనం, కొండపై వసతి అంటూ మోసం

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి నిలువు దోపిడీ

40 ఫేక్‌ వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదులు

తిరుమల, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి, కొండపై వసతికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు కేటుగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. దర్శనం, గదుల కోసం ఇంటర్నెట్‌లో వెతికే వారిని టార్గెట్‌ చేసుకుని దోచేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న క్రమంలో భక్తులకు దర్శన నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారానే దర్శనాలు, ఆర్జితసేవలు, గదుల కోటాను అధికంగా విడుదల చేస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు- దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, అంగప్రదక్షిణ, ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవలు, లక్కీడిప్‌ ఇలా చాలావరకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి.. వాటిలో ఆర్జిత సేవలు, దర్శనాలు, గదులు బుక్‌ చేసుకోవచ్చంటూ భక్తులను మోసగిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి, గదులకు అధిక డిమాండ్‌ ఉండటంతో భక్తులు కూడా సైబర్‌ నేరగాళ్ల వలలో పడి నిలువు దోపిడీకి గురవుతున్నారు. అలా మోసపోయిన భక్తుల నుంచి టీటీడీ ఉన్నతాధికారులకు, విజిలెన్స్‌ విభాగానికి నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. నకిలీ టికెట్లతో తిరుమలకు వచ్చి మోసపోయామని గుర్తించి.. నిరాశతో తిరిగి వెళ్లే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. టీటీడీ విజిలెన్స్‌ విభాగం కేసులు నమోదు చేసి అరెస్టులు చేసినా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు.

నకిలీలపై నిఘా

నకిలీ వెబ్‌సైట్లను నమ్మి భక్తులు మోసపోతున్న క్రమంలో టీటీడీ పేరుతో చలామణి అవుతున్న వెబ్‌సైట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగానే నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ ఐటీ విభాగం దాదాపు నెలరోజులుగా నిఘా ఉంచింది. తిరుపతి దర్శన్‌ బుకింగ్‌, తిరుపతి దర్శనం.ఇన్‌ వంటి పేర్లతో ఉన్న సైట్ల నుంచి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత ఆయా వెబ్‌సైట్ల ఐపీ అడ్ర్‌సలను, వారు వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ నంబర్లు, మోసం చేసే తీరును ఓ నివేదికగా తయారు చేసి తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 40 నకిలీ సైట్లు భక్తులను మోసగిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. అలాగే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా భక్తులను మోసగించే వారి వివరాలను పోలీసులకు అందించారు. ఇందులో టీటీడీలో ఉద్యోగాలు కల్పిస్తామనే మోసగాళ్లను కూడా గుర్తించారు. తిరుపతి, తిరుమల, దర్శనం, టీటీడీ రూమ్స్‌ వంటి పేర్లతో బ్రౌజర్‌లో సెర్చ్‌చేస్తే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే మొదటిగా వచ్చేలా ఐటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే నకిలీ వెబ్‌సైట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ విభాగానికి టీటీడీ లేఖ రాసే యోచనలో ఉంది. వారి సహకారంతో పూర్తి స్థాయిలో నకిలీ వెబ్‌సైట్ల బెడదను తొలగించుకోవాలని ఆలోచిస్తోంది.

4.jpg

అధికారిక వెబ్‌సైట్‌నే సంప్రదించండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవలు, గదులు, ఇతర సమాచారంతో టీటీడీ అధికారికంగా ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ను భక్తులకు అందుబాటులో ఉంచింది. దీనితోపాటు సెల్‌ఫోన్‌ యూజర్ల కోసం ‘టీటీదేవస్థానమ్స్‌’ అనే యాప్‌ను కూడా ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చాం. భక్తులు వీటి ద్వారానే దర్శన, వసతి, ఆర్జిత సేవలు పొందాలి. వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్‌సైట్‌, యాప్‌లో నోటిఫికేషన్స్‌లో పొందుపరుస్తున్నాం. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దు.

- సందీప్‌రెడ్డి, జీఎం, టీటీడీ ఐటీ విభాగం

Updated Date - 2023-04-17T02:35:35+05:30 IST