టీటీడీ ఎలక్ర్టిక్ బస్సు చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం
ABN , First Publish Date - 2023-09-26T01:57:29+05:30 IST
టీటీడీ ఎలక్ర్టిక్ బస్సు చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం మంగళవారం బృందాలుగా ఏర్పడి గాలించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.

తిరుమల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఎలక్ర్టిక్ బస్సు చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి కోసం మంగళవారం బృందాలుగా ఏర్పడి గాలించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అలాగే బస్సు చోరీకి గురికావడంలో ఎవరి నిర్లక్ష్యం ఉంది, తప్పు ఎవరిదనే అంశాలపైనా తిరుమల క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో చార్జింగ్‌లో ఉన్న ఎలక్ర్టిక్ ఉచిత బస్సు(ధర్మరథం)ను ఆదివారం వేకువజామున తిరుమల నుంచి చోరీ చేయగా, జీపీఎస్ ఆధారంగా నాయుడుపేటకు సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు. చోరీకి పాల్పడింది ఒకరేనా, బృందమా, వీరికి ఎవరైనా సహకరించారా, బస్సును ఏం చేయాలనుకున్నారు వంటి అంశాలపై విచారిస్తున్నారు. మంగళవారం తిరుమలలో చక్రస్నానం ఘట్టం అనంతరం బృందాలుగా విడిపోయి చోరీకి పాల్పడిన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పటికే బస్సును హైవేపై వదిలి.. పారిపోయిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడున్న ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. బస్సు నుంచి మొత్తం ముగ్గురు దిగి.. పరుగులు తీశారని తెలిసింది.
సంబంధిత అధికారులను విచారించనున్న పోలీసులు
ఈనెల 16వ తేదీన ఎలక్ర్టిక్ కారు చోరీ జరిగిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం వల్లే.. ఇపుడు బస్సు చోరీకి దారి తీసిందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇక ఎలక్ర్టిక్ ధర్మరథాలు అనేవి కేవలం తిరుమలలోనే భక్తుల రవాణా కోసం వినియోగిస్తారు. అలాంటి బస్సు తిరుమల నుంచి తిరుపతికి వెళుతుంటే టోల్‌గేట్‌లోని భద్రతా సిబ్బందికి కూడా అనుమానం రాకపోవడంపైనా విమర్శలొస్తున్నాయి. టోల్‌గేట్ సిబ్బంది ప్రశ్నించే ఉంటే ఇంతవరకు వచ్చేది కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ట్రాన్స్‌పోర్టు అధికారుల్లో ఒకరిని ఇప్పటికే తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో పైఅధికారిని, విజిలెన్స్ అధికారిని కూడా పోలీస్టేషన్‌కు పిలిపించి విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
ఇంతకీ బాధ్యులెవరు?: జనసేన, టీడీపీ
తిరుపతి(తిలక్‌రోడ్), సెప్టెంబరు 25: శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ తిరుమలలో ఎలక్ర్టిక్ బస్సు చోరీ చేశారంటే.. దీనికి బాధ్యులెవరని జనసేన, టీడీపీ నాయకులు ప్రశ్నించారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జనసేన తిరుపతి అసెంబ్లీ ఇన్‌చార్జి కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. రేపో, మర్నాడో స్వామివారి విగ్రహాన్ని మార్చేసినా, కిరిటాన్ని ఎత్తుకెళ్లి మరోటి ఏర్పాటు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. చోరీపై వివరణ ఇవ్వడానికి టీటీడీ రవాణా విభాగం వారిని మీడియా ముందుకు రావడానికి వీల్లేదని చైర్మన్, ఈవోలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీలోని 40 నుంచి 50మంది ఎమ్మెల్యేలు.. జనసేన, టీడీపీ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వారిని నివారించడానికే తమ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. గతంలోనూ పింక్ డైమండ్‌పై రాద్ధాంతం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తిరుపతి కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ నగరాధ్యక్షుడు చిన్నబాబు కూడా ప్రసంగించారు. జనసేన నాయకులు రాజారెడ్డి, సుమన్ రాయల్, రమే్‌షబాబు, టీడీపీ నేత మనోహర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.