నేడు టీటీడీ బోర్డు సమావేశం
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:05 AM
టీటీడీ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగనుంది.
తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగనుంది. చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు జనవరి 1వ తేదీ వరకు జరుగునున్న నేపథ్యంలో వాటిపై చర్చించనున్నారు. రూ.600 కోట్లతో తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుకవైపు ఉన్న 2, 3 సత్రాల స్థానంలో నిర్మించాలని నిర్ణయించిన అచ్యుతం, శ్రీపథం సముదాయాలకు సంబంఽధించిన టెండర్లను ఖరారు చేసే అవకాశముంది. క్షురకుల జీతాలు, ఎస్వీ మ్యూజిక్ కాలేజీలో సీట్ల పెంపు అంశాలపైనా చర్చించనున్నారు. యథావిధిగా పలు రకాల కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు.