టమోటా రూ.66.70

ABN , First Publish Date - 2023-06-26T01:33:03+05:30 IST

ఈ సీజన్‌లోనే అత్యధికంగా ఆదివారం టమోటా ధరలు పెరిగాయి. ఇటీవల గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో తుఫాన్‌ దెబ్బకు టమోటా పంట తుడిచిపెట్టుకుపోయింది. బయట రాష్ట్రాల్లో టమోటా దిగుబడి తగ్గడంతో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి.

టమోటా  రూ.66.70
పుంగనూరు యార్డులో టమోటాలు

పుంగనూరు, జూన్‌ 25: ఈ సీజన్‌లోనే అత్యధికంగా ఆదివారం టమోటా ధరలు పెరిగాయి. ఇటీవల గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో తుఫాన్‌ దెబ్బకు టమోటా పంట తుడిచిపెట్టుకుపోయింది. బయట రాష్ట్రాల్లో టమోటా దిగుబడి తగ్గడంతో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ సీజన్‌ పలు ఆటుపోట్లు నడుమ టమోటా వ్యాపారం సాగింది. మొదట్లో కనీస గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్ర వ్యథతో వందలాది ఎకరాల్లో టమోటాలు కోయకుండా వదిలేశారు. పశువుల మేతగా వదలగా ఆశచావని కొందరు రైతులు టమోటాను మార్కెట్‌కు తీసుకెళ్లారు. కోత కూలీలు కూడా రాకపోవడంతో రవాణా, గేట్లు, కమీషనుకు చేతినుంచి పడటంతో రోడ్లపక్కన పారబోశారు. ఎకరం టమోటా సాగు చేయడానికి రైతు దాదాపు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కనీస మద్దతు ధరలేక ఎందరో రైతులు ఆశలు వదులుకున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల మేర నష్టపోయారు. జూన్‌ ప్రారంభం నుంచి కొద్దికొద్దిగా ధరలు పెరగడం ప్రారంభమై ఆదివారం నాటికి ఊహించని స్థాయికి చేరాయి. పుంగనూరులో నాణ్యత గల టమోటా కిలో రూ.66.70, రూ.60, రూ.53.40, రెండో రకం రూ.33.40, రూ.40, రూ.53.40 పలికాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు 603.12 టన్నుల టమోటా రాగా వివిధ ప్రాంతాలకు వ్యాపారస్తులు విక్రయాలకు ఎగుమతి చేశారు. మదనపల్లెలో రూ.69 నుంచి రూ.80వరకు, పలమనేరులో రూ.15 నుంచి రూ.70, వి.కోటలో రూ.15 నుంచి రూ.68, ములకలచెరువులో రూ.33 నుంచి రూ.53 వరకు ధరలు పలికాయి. పుంగనూరులో శనివారం కిలో రూ.43.40 నుంచి ఒక్కసారిగా రూ.66.70 పెరగడంతో రోజులోనే రూ.23.30 ధర పెరిగింది.

అమ్మో.. టమోటా దొంగలు

సోమల: పశ్చిమ మండలాల్లో కొత్తగా టమోటా దొంగలు తయారయ్యారు. టమోటా ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు యువకుల కన్ను వీటిపై పడింది. పుంగనూరులో కిలో రూ.66.70 పలికింది. ఈ క్రమంలో నాలుగైదు కిలోల టమోటాలను కోసుకెళ్లి.. అమ్ముకున్నా చేతి ఖర్చులకు వస్తుందని చిల్లర దొంగలు భావించారు. ఇలా సోమల మండలం సూరయ్యగారిపల్లెకి చెందిన విశ్రాంత హెచ్‌ఎం పోకల రామచంద్రకు చెందిన టమోటా తోటలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు వెళ్లారు. వీరు టమోటాలు కోస్తున్నారని తెలిసి రామచంద్ర అక్కడికి చేరుకునేలోపు రెండు బాక్సులతో ద్విచక్రవాహనంలో వారు పరారయ్యారు. ఇంకా, చిన్న సోమల సమీపంలో కేశవులు టమోటా తోటలో 10 బాక్సులు.. శెట్టివారి నవీన్‌ పొలంలో 10 బాక్సుల టమోటాలను కోసుకెళ్లారని శనివారం బాధితులు వాపోయారు. టమోటాలు ధరలు పెరగడంతో కొందరు చిల్లర దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. వీటిని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పొలాల వద్ద జాగరణ చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2023-06-26T01:33:03+05:30 IST