ఈ గెలుపు లోకేశ్‌కు అంకితం

ABN , First Publish Date - 2023-03-19T01:11:34+05:30 IST

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తన గెలుపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అంకితమని కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు.

ఈ గెలుపు లోకేశ్‌కు అంకితం
కంచర్ల శ్రీకాంత్‌ను సన్మానిస్తున్న టీడీపీ నేతలు

చిత్తూరు సిటీ, మార్చి 18: తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తన గెలుపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అంకితమని కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకముంచి ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సభ్యత్వ నమోదు నుంచి ఎన్నికల ప్రచారం, పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు తన గెలుపునకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ ఫలితాలతో ప్రజల మనసుల్లో ఏముందో బయటపడిందన్నారు. సీఎం జగన్‌ ప్రకటించిన మూడురాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. సీఎం ఎన్నికలముందు ప్రజలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసముందని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే తిరిగి రాష్ట్ర భవిష్యత్తు నిలబడుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా విద్యావంతులు తమ మనోగతాన్ని వెల్లడించారన్నారు. వైసీపీ బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడేరోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ ప్రభంజనం ప్రారంభమైందని, ఇది 2024 ఎన్నికల వరకు కొనసాగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడిని సీఎం చేసేవరకు టీడీపీ శ్రేణులు విశ్రమించేది లేదన్నారు.

శ్రీకాంత్‌కు సన్మానం

ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జిల్లా టీడీపీ కార్యాలయానికి వచ్చిన కంచర్ల శ్రీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు. గజమాల, దుశ్శాలువాలతో సత్కరించారు. కేక్‌ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, మాజీ మేయర్‌ కటారి హేమలత, నేతలు చంద్రప్రకాష్‌, పాచిగుంట మనోహర్‌ నాయుడు, చిట్టిబాబు, సుబ్బానాయుడు, దశరథ వాసు, త్యాగరాజన్‌, మోహన్‌రాజ్‌, సీఎం విజయ, రాణి, హేమాద్రినాయుడు, శంకర్‌, రాజశేఖర్‌, ఈశ్వర్‌, నిత్యానందం, ఉదయకుమార్‌, వెంకటేష్‌, గోపి, శ్రీదుర్గ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:11:34+05:30 IST