ఈ నెలలోనూ కొత్త పెన్షన్ లేదు
ABN , First Publish Date - 2023-08-02T01:47:04+05:30 IST
వైఎస్సార్ పెన్షన్ కానుక కింద జూలైలో ఇవ్వాల్సిన కొత్త పింఛన్లను.. ఆగస్టులోనూ ఇవ్వలేదు. పలు కారణాలు చూపుతూ గత నెల ఇవ్వకపోగా.. ఈ నెల నుంచి ఇస్తామని డీఆర్‌డీఏ అధికారులు చెప్పారు.
చిత్తూరు (సెంట్రల్), ఆగస్టు 1: వైఎస్సార్ పెన్షన్ కానుక కింద జూలైలో ఇవ్వాల్సిన కొత్త పింఛన్లను.. ఆగస్టులోనూ ఇవ్వలేదు. పలు కారణాలు చూపుతూ గత నెల ఇవ్వకపోగా.. ఈ నెల నుంచి ఇస్తామని డీఆర్‌డీఏ అధికారులు చెప్పారు. ఆ ప్రకారం కొత్త పెన్షన్ రాకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. ఏడాదికి రెండు సార్లు (జూలై, జనవరి) కొత్త వారికి పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూలైలో ఇవ్వాలంటే.. దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మే నెల నుంచి ప్రారంభించాలి. ఆ దిశగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు దృష్టి సారించలేదు. రెండు నెలలైనా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త పింఛన్ల కోసం జనవరి నుంచి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు ఇలా 16 వర్గాలకు చెందిన వారు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలల కాలంలో 10 వేల నుంచి 13 వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్‌డీఏ అధికారుల అంచనా. మరో నెల పెరగడంతో కొత్త పెన్షన్ దారుల సంఖ్య 15 వేలకు దాటింది. కనీసం ఈ నెలలోనైనా కొత్త పింఛనుదారుల గుర్తింపునకు చర్యలు చేపట్టి.. సెప్టెంబరు నుంచైనా పింఛన్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు.