షార్‌లో సందడే సందడి

ABN , First Publish Date - 2023-03-26T02:14:35+05:30 IST

శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌లో శనివారం సందడి నెలకొంది.

షార్‌లో సందడే సందడి

సూళ్లూరుపేట, మార్చి 25 : శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌లో శనివారం సందడి నెలకొంది.ఆదివారం ఉదయం 9గంటలకు ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగ నేపథ్యంలో మన శాస్త్రవేత్తలతో పాటు విదేశీ శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు షార్‌ నుంచి జీఎ్‌సఎల్‌వీ మార్క్‌ ప్రయోగాలు ఐదు చేపట్టారు. ఇది ఆరో ప్రయోగం కావడం విశేషం. వాణిజ్య రంగ ప్రయోగం కావడంతో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత పారిశ్రామిక దళ సిబ్బందితో(సీఐఎ్‌సఎఫ్‌) పాటు పోలీసులు కూడా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. షార్‌ కేంద్రంతో పాటు శ్రీహరికోట చుట్టుపక్కలున్న అడవుల్లో, సముద్ర మార్గాన గస్తీ పెంచారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో అట్టకానితిప్ప వద్ద సీఐఎస్‌ఎఫ్‌ అవుట్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. షార్‌ మొదటి గేటు వద్ద సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంధి ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. కొరిడి-పేర్నాడు, వేనాడు దీవికి వెళ్లే వాహనాలను సైతం తనిఖీ చేసి ఆ గ్రామాలకు వెళ్లే వారి వివరాలడిగి పంపుతున్నారు.

రాకెట్‌ విజయం కోసం చెంగాళమ్మకు పూజలు

సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శనివారం ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌ సోమనాథ్‌ దర్శించుకున్నారు. ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ విజయం కోసం పూజలు చేశారు.ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాస రెడ్డి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ మాట్లాడుతూ ఎల్‌వీఎం3-ఎం3 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ నిరాటంకంగా జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ మూడో వారంలో పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ ద్వారా సింగపూర్‌ దేశానికి చెందిన ఉపగ్రహాన్ని పంపుతామని తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి కూడా సన్నాహాలు చేస్తున్నామన్నారు. జూన్‌లో సూర్యుని మీద పరిశోధనకు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని పంపనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట షార్‌ గ్రూపు డైరెక్టర్‌ గోపికృష్ణ తదితరులున్నారు.

Updated Date - 2023-03-26T02:14:35+05:30 IST