వైసీపీని గద్దె దించడమే ధ్యేయం

ABN , First Publish Date - 2023-06-03T01:48:35+05:30 IST

వైసీపీని గద్దె దించడమే తమ ధ్యేయమని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక పద్మావతీపురంలోని ఎల్వీ కల్యాణ మండపంలో టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

వైసీపీని గద్దె దించడమే ధ్యేయం
ఐక్యతను చాటుతున్న నాయకులు

తిరుపతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీని గద్దె దించడమే తమ ధ్యేయమని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక పద్మావతీపురంలోని ఎల్వీ కల్యాణ మండపంలో టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సంఘటితం కావాల్సిన అవసరముందన్నారు. తద్వారా కార్మిక ద్రోహి సీఎం జగన్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలన్నారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ మాట్లాడుతూ.. 1982 నుంచి ఇప్పటివరకు కార్మికులకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. సంపద సృష్టించడం తెలియని జగన్‌ అప్పులు తేవడంలో ముందున్నారని ఆరోపించారు. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సుగుణమ్మ మాట్లాడుతూ.. భవన నిర్మాణ, రవాణా, విద్యుత్‌ రంగ కార్మికులు వైసీపీ విధానాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమరావతి జేఏసీ ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి తాండయం సత్యనారాయణ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామన్న సీఎం జగన్‌ ఆ మాట తప్పారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థ ఆస్తులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు రత్నకుమార్‌, రాధాకృష్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన కార్మిక చట్టాలను, ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం ట్రేడ్‌ యూనియన్ల ప్రథమ కర్తవ్యమని, ఇందుకోసం కలిసి పోరాడతామని అన్నారు. టీఎన్‌టీయూసీ నాయకులు అంబూరి సింధూజ, శేషగిరిరావు, జయరామిరెడ్డి, మాధవనాయుడు, మల్లికార్జునరావు, లక్ష్మీపతినాయుడు, పొత్తూరి రెడ్డెప్పనాయుడు, మధు, బాలాజీ, సుబ్రహ్మణ్యం, నాగమణి, కోగంటి లెనిన్‌బాబు, శ్యామ్‌, మహంకాళి, నరసింహారావు, సూర్యప్రకాష్‌, బాబునాయుడు, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:48:35+05:30 IST