అంతటా టీడీపీ సంబరాలు

ABN , First Publish Date - 2023-03-24T02:21:41+05:30 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో జిల్లా అంతటా టీడీపీ నేతలు సంబరాలు జరుపుకొన్నారు.

అంతటా టీడీపీ సంబరాలు
చిత్తూరులో గాంధీ విగ్రహంవద్ద టీడీపీ నేతల ఆనందోత్సాహం

చిత్తూరు సిటీ, మార్చి 23: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో జిల్లా అంతటా టీడీపీ నేతలు సంబరాలు జరుపుకొన్నారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు తినిపించుకున్నారు. గురువారం రాత్రి చిత్తూరులోని గాంధీ విగ్రహం ఎదుట సంబరాల్లో టీడీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీ విజయ పరంపర ప్రారంభమైందని.. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు ఇకపై చెల్లవన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజి, మాజీ మేయర్‌ కటారి హేమలత, నేతలు చెరుకూరి వసంత్‌ కుమార్‌, మోహన్‌రాజ్‌,రాజశేఖర్‌, ఈశ్వర్‌, ఆనంద్‌, గుణశేఖర్‌ నాయుడు, యువరాజులు నాయుడు,శేషాద్రి నాయు డు, మేషాక్‌, బి.మదన్‌కుమార్‌,వెంకటేష్‌ యాదవ్‌, రాజా నాయుడు, రాము, మదు, ప్రభుతేజ, నారాయణ, కె.లావణ్య, వరలక్ష్మి, శ్రీదుర్గ తదితరులు పాల్గొన్నారు. అలాగే, పలమనేరులో జాతీయ రహదారిపై బాణసంచా పేల్చారు. వి.కోటలో ఎన్టీఆర్‌ కూడలి వద్ద టీడీపీ నేతలు స్వీట్లు పంచిపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో అధికార పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. పట్టభద్రులే కాదు.. సొంతపార్టీ ఎమ్మెల్యేల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనేది వ్యక్తమైందని రామకుప్పంలో టీడీపీ నేతలు పేర్కొన్నారు. 23వ తేది, 23వ సంవత్సరం 23 ఎమ్మెల్యేల ఓట్లు అని రాసి ఉన్న కేకును కుప్పంలో కట్‌ చేశారు. శాంతిపురంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. గుడుపల్లెలో టపాసుల కాల్చారు. నగరిలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇలా.. జిల్లా అంతటా టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహంతో సందడి చేశారు.

జగన్‌రెడ్డీ.. నీ పనైపోయింది: టీడీపీ

సీఎం జగన్‌ రెడ్డి.. నీ పనైపోయిందంటూ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్‌, పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, మాజీ మేయర్‌ కటారి హేమలత, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు వీరు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లోనే ప్రజలు టీడీపీ వైపుఉన్నారని తెలిసిపోయిందని, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జగన్‌ రెడ్డిపై ఎమ్మెల్యేల మనసుల్లో ఏముందో బట్టబయలైందని తెలిపారు. బటన్‌ నొక్కి ప్రజలకు డబ్బులు పంచుతున్నానంటూ హడావిడి చేసినా జగన్‌.. అవినీతి, దుబారా, దోపిడీని ప్రజలు గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. మూడోతరగతి చదివిన వారితో పట్టభద్రుల ఓట్లు వేయించినా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-03-24T02:21:41+05:30 IST