పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2023-09-20T01:18:05+05:30 IST
జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకునే రీతిలో పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు కలెక్టర్ షన్మోహన్ సూచించారు.

చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 19: జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకునే రీతిలో పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు కలెక్టర్ షన్మోహన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన డిస్ట్రిక్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ పాలసీ 2023- 2027ను తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగా కొత్త పాలసీలపై ఈ నెలాఖరులోగా ఔత్సాహికపారిశ్రామికవేత్తలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో అర్హులైన లబ్ధిదారుల పేర్లను రిజిస్టర్ చేయాలన్నారు. గండ్రాజుపల్లె వద్ద సబ్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని చెప్పారు. కొత్త పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు రాయితీల కోసం అందిన 91 క్లెయిమ్‌లకు రూ.4.41 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని పండ్ల పరిశ్రమల సమాఖ్య కార్యదర్శి గోవర్ధన్ బాబి కోరారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.