ఆ ఐదుగురికీ అనుమానమేనా?
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:19 PM
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీలో అంతర్మథనం మొదలైంది. గెలుపు ధీమా బింకంగా మారింది. వైనాట్ 175 అన్నవారే ఆందోళన పడుతున్నారని ఇన్‌చార్జిల మార్పు ప్రక్రియ ప్రారంభంతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల సిటింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పుంగనూరులో పెద్దిరెడ్డి, కుప్పంలో భరత్ తప్ప మిగిలినవారందరిలోనూ సర్వేలు ఎవరి కొంప ఏ విధంగా ముంచుతాయో అనే ఆందోళన పెరుగుతోంది. ఇదేసందని ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి వర్గాలు గొంతు పెంచుతున్నాయి. జగన్ ముద్దు అంటూనే వీళ్లు మాత్రం వద్దు అనే నినాదం పెల్లుబుకుతోంది. మొత్తంమీద వైసీపీలో కొత్త కల్లోలం మొదలైంది.
చిత్తూరు-ఆంధ్రజ్యోతి:
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీలో అంతర్మథనం మొదలైంది. గెలుపు ధీమా బింకంగా మారింది. వైనాట్ 175 అన్నవారే ఆందోళన పడుతున్నారని ఇన్‌చార్జిల మార్పు ప్రక్రియ ప్రారంభంతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల సిటింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పుంగనూరులో పెద్దిరెడ్డి, కుప్పంలో భరత్ తప్ప మిగిలినవారందరిలోనూ సర్వేలు ఎవరి కొంప ఏ విధంగా ముంచుతాయో అనే ఆందోళన పెరుగుతోంది. ఇదేసందని ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి వర్గాలు గొంతు పెంచుతున్నాయి. జగన్ ముద్దు అంటూనే వీళ్లు మాత్రం వద్దు అనే నినాదం పెల్లుబుకుతోంది. మొత్తంమీద వైసీపీలో కొత్త కల్లోలం మొదలైంది.
చిత్తూరులో మార్పు తప్పదా?
జిల్లా కేంద్రం చిత్తూరులో వర్గపోరే సిటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సిటింగ్ స్థానానికి ఎసరు పెట్టచ్చనే ప్రచారం సాగుతోంది. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి వర్గం ఇక్కడ బలంగా ఉంది. రెండు పాయలుగానే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రూ.కోట్లు ఖర్చుచేస్తూ జనానికి దగ్గరైన విజయానందరెడ్డితో కనీస సఖ్యత లేని ఆరణిని మళ్లీ కొనసాగించకపోవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఏకంగా విజయానందరెడ్డి పేరే ఇక్కడ వినిపించడం కూడా ఇందుకు బలమైన కారణం. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటు మొగ్గుతారన్న దాన్ని బట్టే చిత్తూరులో మార్పుచేర్పులు ఉండవచ్చని అంటున్నారు. మొత్తంగా ఇరువర్గాల్లోనూ టికెట్ టెన్షన్ మొదలైంది.
పలమనేరులో బోస్‌తో చెక్?
పలమనేరులో వెంకటేగౌడకు ఈసారి టికెట్ దక్కదనే ప్రచారం సాగుతున్న తరుణంలోనే బోస్ వైసీపీలో చేరడంతో ఇక్కడా కలవరం మొదలైంది. ఐప్యాక్ సర్వే టీమ్ సహా ఇంటిలిజెన్స్ వర్గాలు అమరనాథరెడ్డికి అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతోనే పదేళ్లుగా మౌనంగా ఉన్న బోస్‌ను ఆగమేఘాలమీద వైసీపీలో చేర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఎమ్మెల్యే వెంకటేగౌడకు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఇప్పటికే వ్యతిరేక వర్గాలున్నాయి. ఈనేపథ్యం కూడా పలమనేరులో మార్పు తప్పదనే ప్రచారానికి బలమైన కారణంగా మారింది.
నగరిలో రెండేళ్లుగా డేంజర్ బెల్స్
నగరిలో రోజాకి ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరందుకుంది. నిజానికి రెండేళ్ల కిందటి నుంచే ఇక్కడ ఈ డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రోజాకు సొంత పార్టీలోనే బలమైన వ్యతిరేక వర్గం ఉంది. నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు, వడమాలపేట మండలాలన్నింటిలోనూ ప్రాబల్యం కలిగిన నాయకులు అభ్యర్థి మార్పు కోసం ఐక్యంగా పోరాడుతున్నారు. మంత్రి రోజాకు తప్ప తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా పరవాలేదని, పరస్పరం సహకరించుకుని గెలిపించుకుంటామని ఎప్పటి నుంచో అధిష్ఠానానికి చెబుతూనే ఉన్నారు. అలా కాని పక్షంలో కొత్తవారికి ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపిస్తామంటున్నారు. తాజాగా వైసీపీలో ఇన్‌చార్జులు, అభ్యర్థుల మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నగరిలో పాత నినాదం మళ్లీ ఊపందుకుంటోంది. రోజా వ్యతిరేక వర్గానికి ఇద్దరు మంత్రుల మద్దతు పుష్కలంగా ఉందన్నది తొలినుంచీ ప్రచారంలో ఉంది. ఇపుడు కూడా వారి మద్దతుతోనే రోజా వ్యతిరేక వర్గం రంగంలోకి దిగి జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం. ఇదే నిజమైతే రోజాకు నచ్చజెప్పడమే పార్టీ అధిష్ఠానానికి పెద్ద సవాలుగా మారనుంది. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రోజా తనకు టికెట్ నిరాకరిస్తే తలొగ్గి మౌనంగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఏం జరగబోతోందనే టెన్షన్ రోజా అనుకూల, వ్యతిరేక వర్గాల్లో కొనసాగుతోంది.
పూతలపట్టు సంప్రదాయం
పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, వైసీపీలు ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థిని మారుస్తూనే ఉన్నాయి. ఈసారీ అదే సంప్రదాయం కొనసాగేలా ఉంది. నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నాయకులు కలిసి బంగారుపాళ్యానికి చెందిన వైసీపీ నేత విద్యాసాగర్‌రెడ్డి ఇంట్లో ఆమధ్య సమావేశమై, సిటింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అభ్యర్థి అయితే పనిచేయబోమని తీర్మానించిన విషయం తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో రెండోసారి టికెట్టు కోసం చివరి వరకూ ప్రయత్నించి విఫలమైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ పేరు తెరమీదకు వచ్చింది. ఇక్కడ మార్పు తప్పదనే ప్రచారాన్ని పెంచింది.
పొగడ్తలే కాపాడుతాయా?
జీడీనెల్లూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. పెనుమూరు మండలంలో ఎన్‌ఆర్‌ఐ సలహాదారు జ్ఞానేందర్‌రెడ్డి ఉండడంతో అది మరింత ఎక్కువగా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తన కూతురికి టికెట్టు ఇవ్వాలని నారాయణస్వామి అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకుంటున్నారు. ఆమె ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కూడా. తండ్రి బదులు కూతురు తెరమీదకు వస్తారనే ప్రచారం ఇక్కడ జరుగుతోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అక్క కుమారుడు రాజేష్ పేరు వినిపించడం కొత్త విశేషం. మరి జగన్‌ను అవకాశం దొరికితే చాలు పొగడ్తలతో ముంచెత్తే నారాయణస్వామి పరిస్థితి ఏమిటనే చర్చకూడా జరుగుతోంది. అసంతృప్తుల తీవ్రత పెరిగిన కారణంగా ఈయనను నియోజకవర్గమే మారుస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.