Share News

టీటీడీ ఏడీ బిల్డింగ్‌ని ముట్టడించిన విద్యార్థులు

ABN , First Publish Date - 2023-12-03T02:32:35+05:30 IST

ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి జితేంద్రకుమార్‌ ఆత్మహత్యకు కారణమైన విజిలెన్స్‌, కాలేజీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం టీటీడీ ఏడీ బిల్డింగ్‌ను విద్యార్థులు ముట్టడించారు.

టీటీడీ ఏడీ బిల్డింగ్‌ని ముట్టడించిన విద్యార్థులు

- విజిలెన్స్‌, కాలేజీ అధికారులపై

చర్యలకు డిమాండ్‌

- ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి

ఆత్మహత్యపై రేగుతున్న దుమారం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 2: ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి జితేంద్రకుమార్‌ ఆత్మహత్యకు కారణమైన విజిలెన్స్‌, కాలేజీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం టీటీడీ ఏడీ బిల్డింగ్‌ను విద్యార్థులు ముట్టడించారు. ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో కాలేజీ నుంచి టీటీడీ ఏడీ బిల్డింగ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండి చలపతి మాట్లాడుతూ.. కొంతకాలంగా విజిలెన్స్‌ సిబ్బంది పెత్తనంపై కాలేజీ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఒకవేళ ఈ అంశంపై దృష్టి పెట్టి ఉంటే ఓ విద్యార్థి నిండు ప్రాణం కోల్పోయి ఉండేవారు కాదని అభిప్రాయపడ్డారు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు హాస్టల్‌ వార్డెన్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. విజిలెన్స్‌ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జితేంద్రకుమార్‌ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలన్నారు. టీటీడీ విద్యాశాఖాధికారి భాస్కరరెడ్డి.. విద్యార్థుల వద్దకు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షులు నవీన్‌, నాయకులు చలపతి, ఉదయ్‌కుమార్‌, హరికృష్ణ, ఓంరాజ్‌, వినయ్‌, ప్రసాద్‌, సురేష్‌, శివ, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి సంఘాల మద్దతు

ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ, ఏబీవీపీ, ఏపీ స్టూడెంట్‌ యూనియన్‌, బీసీ విద్యార్థి సంఘం, పీడీఎ్‌సవో తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. ఆయా సంఘాల నాయకులు హేమంత్‌ రాయల్‌, రాఘవేంద్ర, భాస్కరయాదవ్‌, హేమాద్రి యాదవ్‌, ఆశ, గౌతమి, మహేంద్రనాయక్‌, తిరుమలేష్‌, నాగేశ్వరరావు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకారుల వద్దకు టీటీడీ విద్యాశాఖాధికారి వచ్చి జేఈవోతో చర్చలకు ఆహ్వానించారు. అయితే, జేఈవోనే విద్యార్థుల వద్దకు రావాలని నాయకులు డిమాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రం స్వీకరించిన ఆయన ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వర్షంలోనూ విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు. విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో కోరారు.

ఏం జరిగింది?

- ఆరా తీసిన మంత్రి గుమ్మనూరు జయరాం

జితేంద్రకుమార్‌ ఆత్మహత్యపై ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ, టీటీడీ అధికారులను కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ఫోన్లో ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై అధికారులు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విద్యార్థి ఆత్మహత్యపై వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.

Updated Date - 2023-12-03T02:32:38+05:30 IST