యువగళం ముగింపు సభకు జీజేఎం ఆధ్వర్యంలో ప్రత్యేక రైలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:38 PM
యువగళం ముగింపు సభకు జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ గురజాల జగన్‌మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు సిటీ, డిసెంబరు 18: యువగళం ముగింపు సభకు జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ గురజాల జగన్‌మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో బుధవారం జరగనున్న యువగళం విజయోత్సవం.. ఎన్నికల శంఖారావం సభకు జిల్లా నుంచి భారీఎత్తున టీడీపీ శ్రేణులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు చిత్తూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. పాకాల రైల్వేస్టేషన్‌కు 11.30, మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు, బుధవారం ఉదయం ఉదయం 5.40 గంటలకు విజయనగరం చేరుకుంటుందని పేర్కొన్నారు. 21వ తేది వేకువజామున 12.30 గంటలకు విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి రైలు తిరిగి బయలుదేరుతుందని తెలిపారు.
సభను విజయవంతం చేయండి
యువగళం ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి మమేకమై ప్రజల సమస్యలను, కష్టాలను, నిరుద్యోగులు, రైతులు, మహిళల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. బుధవారం విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే ‘యువగళం విజయోత్సవ సభ’కు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావాలని వారు కోరారు.