త్వరలో ‘ప్రతి గడపకు మహిళా పోలీసు’

ABN , First Publish Date - 2023-05-27T00:49:36+05:30 IST

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, టోల్‌ ప్రీ నెంబరు 1902కు వచ్చే ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి అన్నారు.

త్వరలో ‘ప్రతి గడపకు మహిళా పోలీసు’
ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు, మే 26: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, టోల్‌ ప్రీ నెంబరు 1902కు వచ్చే ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం డీటీసీలో జిల్లా నెలవారీ క్రైమ్‌ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల రక్షణే ధ్యేయంగా త్వరలో ప్రతి గడపకు మహిళా పోలీసు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలకు అవగాహన కల్పించి, రికవరీ చేసిన డబ్బులను సాధ్యమైనంత త్వరలో బాధితులకు అందించాలన్నారు. పెండింగ్‌ కేసులపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి.. వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎర్రచందనం కేసులపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్స్‌ జారీ చేయడంలో చిత్తశుద్ధిని చూపాలన్నారు. సరిహద్దు రాష్ర్టాల నుంచి జిల్లాకు అక్రమంగా రవాణా అయ్యే మద్యంపై నిఘా ఉంచాలని సూచించారు. సారా తయారీ స్థావరాలపై మెరుపుదాడులు చేయడంతోపాటు ఇసుక, మద్యం, ఎర్రచందనం కేసులున్న వారిపై పీడీయాక్టును ప్రయోగించాలన్నారు. అనంతరం బదిలీ అయినా ట్రాఫిక్‌ డీఎస్పీ తిప్పేస్వామిని సన్మానించారు. ఏఎస్పీలు సుధాకర్‌, నాగేశ్వరావు, సెబ్‌ ఏఎస్పీ శ్రీలక్ష్మీ, డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:49:36+05:30 IST