పులికాట్‌ నుంచి జోరుగా వానపాముల స్మగ్లింగ్‌

ABN , First Publish Date - 2023-06-03T01:37:02+05:30 IST

పర్యావరణానికి ఎంతో మేలు చేసే వానపాముల వేట పులికాట్‌ సరస్సులో అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. టన్నుల టన్నుల వానపాములను లోడి తరలించేస్తున్నారు. ఉపాధి కరువైన మత్స్యకారులకు డబ్బు ఆశ చూపి కూలీలుగా మార్చుకుని వీటిని తవ్వి తీస్తున్నారు.

పులికాట్‌ నుంచి జోరుగా వానపాముల స్మగ్లింగ్‌
వానపాములు

పర్యావరణానికి ఎంతో మేలు చేసే వానపాముల వేట పులికాట్‌ సరస్సులో అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. టన్నుల టన్నుల వానపాములను లోడి తరలించేస్తున్నారు. ఉపాధి కరువైన మత్స్యకారులకు డబ్బు ఆశ చూపి కూలీలుగా మార్చుకుని వీటిని తవ్వి తీస్తున్నారు.

మత్స్యకారులను కూలీలుగా మార్చేసి..

ఆంధ్రా, తమిళనాడు పరిధిలో సుమారు 600 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండే పులికాట్‌ సరస్సులో ముప్పావుభాగం ఆంధ్రా పరిధిలో, మిగిలిన ప్రాంతం తమిళనాడు పరిధిలో ఉంది. ఆంధ్రావైపు ఉండే రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు పూడుకుపోయాయి. దీంతో పులికాట్‌ మత్స్య సంపదమీద ఆధారపడి బతికే 18 కుప్పాల ప్రజలకు జీవనోపాధి సమస్యగా మారింది. స్మగ్లర్లు ఈ మత్స్యకారులను కూలీలుగా మార్చేసుకున్నారు. వానపాములు, సున్నపుగుల్లను వెలికితీసి అందించడమే వీరి పని.

సరస్సును జల్లించేస్తున్నారు

సాధారణంగా వానపాములు 10 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. పులికాట్‌ సరస్సులో దొరికే వానపాములు సుమారు అరమీటరు వరకు ఉంటాయి. పైగా సమృద్ధిగా దొరుకుతాయి. వీటిని రొయ్యల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రొయ్యల వృద్ధికోసం తల్లి రొయ్యకు ఆహారం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. దాంతో పులికాట్‌ను జల్లించేస్తున్నారు. వేనాడు, ఇరకం, వాటంబేడు, తడ, కొత్తకుప్పం తదితర ప్రాంతాల్లో వానపాముల వేట ఎక్కువగా కొనసాగుతోంది. తీరప్రాంతంలోని ఒక పంచాయతీలో సుమారు 300మంది కూలీలు ఇదే పనిగా బతుకుతుండటం విశేషం. వీరు బృందాలుగా పడవల్లో సరస్సులోకి వెళ్తారు. ఓ చోట వాటిని నిలిపివేసి నీళ్ల అడుగుభాగాన ఉండే బురదలో ఈ వానపాములను సేకరిస్తున్నారు. వీటిని సూళ్లూరుపేటకు చేర్చి, అక్కడ ప్రత్యేకమైన కవరులో ప్యాకింగ్‌ చేసి కార్లల్లో ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కొనేది 500లకి, అమ్మేది 5000కి

వానపాములను కిలో 500 నుంచి 600 రూపాయలకు స్మగ్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ఒక వ్యక్తి రోజుకు సరాసరిన రెండు కిలోల వానపాములు సేకరిస్తారు. ఆంధ్రా పరిధిలోనే సుమారు 500 మంది కూలీలు ఈ వానపాములు సేకరించే పనిలో ఉన్నారు. దాదాపు ఒక టన్ను వానపాములు రోజుకు సేకరిస్తున్నట్టు అంచనా. వీటిని నెల్లూరు నుంచి ఉభయగోదావరి జిల్లాల వరకు రవాణా చేస్తున్నారు. కిలో 4వేల నుంచి 5వేల రూపాయల వరకు అమ్ముతుండటం విశేషం. మత్స్యసంపద దొరకనప్పుడు ఇంక ఏ వృత్తి చేయలేమని, అందుకే ఈ పనులకు వెళ్తున్నామని కూలీలు చెబుతున్నారు.

సున్నపుగుల్ల కోసం కూడా..

సున్నపు గుల్ల కోసం కూడా పులికాట్‌ను తవ్వేస్తున్నారు. నీళ్ల అడుగుభాగాన బురదమట్టిలో ఒకటి నుంచి మూడు అడుగుల లోతులో సున్నపుగుల్ల ఉంటుంది. నీళ్లల్లో మునిగి రెండు, మూడు అడుగుల మేర మట్టిని తొలగించి ఆ మట్టిలో ఉండే సున్నపుగుల్లను కూలీలు సేకరిస్తారు. సేకరించిన సున్నపుగుల్లను పడవల ద్వారా సమీపంలోని తమిళనాడుకు చెందిన సున్నపుగుంట ప్రాంతానికి తీసుకువెళ్తారు. అక్కడ దీనిని పొడిచేసే పరిశ్రమలు సైతం ఉన్నాయి. వాటిని బస్తాల్లో నింపి గుంటూరుజిల్లా, తమిళనాడులోని సున్నపు ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ముచేసుకొంటున్నారు.

పట్టించుకోని అధికారులు

పులికాట్‌ సరస్సును వన్యప్రాణి విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. అయినా వీటి జోలికి వెళ్లరు. వేనాడు, ఇరకందీవి మధ్య పదుల సంఖ్యలో పడవలు ఒక చోటే నిలిపివేసి ఈ వానపాములను, సున్నపుగుల్లను ఏరివేస్తున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక రోజుకు ఒక్కో పడవ నుంచి 500 నుంచి 1000 రూపాయలవరకు వసూళ్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వానపాములను తరలించుకువెళ్తున్న స్మగ్లర్లు అయితే ఏకంగా నెల మామూళ్లు ఇస్తున్నట్లుగా గుసగుసలు ఉన్నాయి.

- తడ

ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం

అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం వారం కిందట వేనాడులో ఓ వ్యక్తి నుంచి మూడు కిలోల వానపాములను పట్టుకున్నాం. 31,200 రూపాయల జరిమానా విధించాం.

- శ్యామ్యూల్‌, వన్యప్రాణి విభాగం డీఎ్‌ఫవో

Updated Date - 2023-06-03T01:37:02+05:30 IST