స్థానిక ఎమ్మెల్సీగా ‘సిపాయి’ ఏకగ్రీవ ఎన్నిక

ABN , First Publish Date - 2023-02-28T00:37:05+05:30 IST

డిక్లరేషన్‌ ఫారాన్ని అందజేసిన ఆర్వో, జేసీ వెంకటేశ్వర్‌

స్థానిక ఎమ్మెల్సీగా ‘సిపాయి’ ఏకగ్రీవ ఎన్నిక
సిపాయికి డిక్లరేషన్‌ ఫారాన్ని అందజేస్తున్న ఆర్వో, జేసీ వెంకటేశ్వర్‌, పక్కన ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27: స్థానిక సంస్థల కోటాద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనమండలి సభ్యుడిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా చుక్కా ధనుంజయ యాదవ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ పర్వం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియడంతో సిపాయి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎస్‌.వెంకటేశ్వర్‌ ప్రకటించారు. అనంతరం కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ను సిపాయి సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పదవిలో బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆయన ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న దొరబాబు పదవీకాలం ఈ ఏడాది మే ఒకటో తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు వైసీపీకి చెందిన భరత్‌ జిల్లానుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా, సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నికతో ఈ సంఖ్య రెండుకు చేరింది. ఇక పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల విభాగం దృష్టి సారించింది.

ఇది కలా.. నిజమా.. నమ్మలేకున్నా!: సిపాయి

ఎమ్మెల్సీగా ఎంపిక కావడాన్ని ఇంకా తాను నమ్మలేకపోతున్నానని, ఇది కలా? నిజమా..? తెలియడం లేదని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. డిక్లరేషన్‌ ఫారం అందుకున్న తర్వాత కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల పట్ల సీఎం జగన్‌కు ఎంత ప్రేమ ఉందో తనకు టిక్కెట్‌ ఇచ్చి గెలిపించి చూపెట్టారన్నారు. గత ప్రభుత్వం బీసీలను పల్లకిబోయలు వలే తిప్పారని, సూట్‌కే్‌సలు ఇచ్చిన వ్యక్తులకే పదవులు కట్టబెట్టారని విమర్శించారు. బీసీలకు ఒకటో రెండో ఇస్త్రీపెట్టెలు, బ్లేడ్‌ ముక్కలిచ్చి నమ్మకద్రోహం చేశారన్నారు.

బరిలో మిగిలింది వీరు.

పట్టభద్రుల స్థానానికి 22మంది : కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి (టీడీపీ), సన్నారెడ్డి దయాకర్‌ రెడ్డి (బీజేపీ), శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి పేర్నాటి (వైసీపీ), అవిలినేని సరిత (ఇండి), అంకయ్య చౌదరి మక్కెన (ఇండి), కరుణానిధి చిరిపిరెడ్డి (ఇండి), కిరణ్‌ దాసరన్న మట్టిగుంట (ఇండి), కొమ్ము యోహాను (ఇండి), గుల్లపల్లి వీరభద్రాచారి (ఇండి), జైపాల్‌ అప్పంగారి (ఇండి), దొడ్ల శ్రీహరి (ఇండి), నక్కా దినేష్‌ (ఇండి), నీలం సామ్యూల్‌ మోసెస్‌ (ఇండి), పల్లిపట్టు అభినవ్‌ విష్ణు (ఇండి), పూసల రవి (ఇండి), పంతంగి పాలంక రెడ్డి (ఇండి), భాస్కర్‌ రావు కమ్మిశెట్టి (ఇండి), బుస్సా రాజేంద్ర (ఇండి), బొట్టికాయల చంద్రశేఖర్‌ (ఇండి), మహేందర్‌ రెడ్డి నంద్యాల (ఇండి), మాదాసి జాలారావు (ఇండి), మీగడ వెంకటేశ్వర రెడ్డి (ఇండి).

ఉపాధ్యాయ స్థానానికి 8 మంది: కుట్టుబోయిన బ్రహ్మానందం (ఇండి), గుర్రం శ్రీరామమూర్తి (ఇండి), చంద్రశేఖర్‌ పర్వతరెడ్డి (ఇండి), ధనుంజయ శివయోగి (ఇండి), ప్రవీణ పర్వతరెడ్డి (ఇండి), బాబురెడ్డి పొక్కిరెడ్డి (ఇండి), ఎల్‌.సి.రమణారెడ్డి (ఇండి), లక్కు అనసూయ (ఇండి).

పోటీలో ముగ్గురు మహిళలు: పట్టభద్రుల స్థానానికి అవిలినేని సరిత (ఇండి), ఉపాధ్యాయ స్థానానికి ప్రవీణ పర్వతరెడ్డి (ఇండి), లక్కు అనసూయ (ఇండి) ఉన్నారు.

మార్చి 16న ఎన్నికలు

ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్న యండపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పదవీకాలం ఈ మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఎన్నికలు మార్చి 16న జరుగనున్నాయి.

Updated Date - 2023-02-28T00:37:05+05:30 IST