‘పట్టు’ తప్పిన కేంద్రం!

ABN , First Publish Date - 2023-06-03T01:28:17+05:30 IST

ఒకప్పుడు జిల్లా అంతటికి పట్టుగుడ్లు సరఫరా చేసిన.. ఉత్పత్తి కేంద్రం నేడు ఎందుకూ కొరగాకుండా పడుంది. దాదాపు 38 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతున్నా.. ఈ పట్టుగుడ్ల కేంద్రం మాత్రం నిరాదరణతో మూతపడింది. ప్రభుత్వం, పట్టుపరిశ్రమ శాఖ నిర్లక్ష్యంతో భవనాలన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయి.

‘పట్టు’ తప్పిన కేంద్రం!
పలమనేరు పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రంలో వృథాగా మారిన భవనాలు

ఒకప్పుడు జిల్లా అంతటికి పట్టుగుడ్లు సరఫరా చేసిన.. ఉత్పత్తి కేంద్రం నేడు ఎందుకూ కొరగాకుండా పడుంది. దాదాపు 38 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతున్నా.. ఈ పట్టుగుడ్ల కేంద్రం మాత్రం నిరాదరణతో మూతపడింది. ప్రభుత్వం, పట్టుపరిశ్రమ శాఖ నిర్లక్ష్యంతో భవనాలన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయి.

- పలమనేరు

నాణ్యమైన పట్టుగూళ్ల దిగుబడికి పట్టుగుడ్లు కీలకం. ఈ పట్టుగుడ్ల తయారీలో ఏ చిన్న నిర్లక్ష్యం దొర్లినా.. పట్టుపురుగుల పెంపకంలోని నాలుగు దశల్లో ఏదో ఒకచోట పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనే నాణ్యమైన పట్టుగుడ్ల తయారీకి నాలుగు దశాబ్దాల కిందట పలమనేరు సమీపంలోని ఏడు ఎకరాల్లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టుగుడ్ల ఉత్పత్తికి కావాల్సిన పలు భవనాలను రూ.కోట్లు వెచ్చించి నిర్మించారు. పట్టుగుడ్లకు కావాల్సిన పట్టుపురుగులను కూడా ఇక్కడే పెంచేందుకు భవనాలు నిర్మించారు. మంచి నాణ్యత గల మల్బరీ ఆకులు తింటేనే పట్టుపురుగులు నాణ్యమైన గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. అందుకని మల్బరీ తోటల సాగునూ ఇక్కడ చేపట్టారు. దీనికోసం పెద్ద బావి తవ్వించారు. నీటిని లిఫ్టింగ్‌ చేసి నిల్వ ఉంచేందుకు పెద్ద సంపును సిద్ధం చేశారు. బావిలో నీళ్లు తగ్గాయని పదేళ్ల కిందట నాలుగు బోర్లువేశారు. అందులో రెండింట్లో నీరు సరిగా రాలేదని మోటర్లు తీసి వేశారు. ఇక, ఇక మల్బరీ తోటలకు వర్మికల్చర్‌ ఎరువు తయారీకి షెడ్డును నిర్మించారు. ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించి నాణ్యమైన పట్టుగుడ్లు తయారుచేసి ఉమ్మడి జిల్లాలోని రైతులకు సరఫరా చేసేవారు. క్రమేణా దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. ఫలితం ఈ పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం మూతపడింది. భవనాలన్నీ దెబ్బతిన్నాయి. మల్బరీ తోటలు సాగు చేసిన పొలాలాన్ని ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. రెండు బోర్లు, బావికి ఏర్పాటు చేసిన మోటర్లు తుప్పు పడుతున్నాయి.

నాణ్యమైన పట్టుగుడ్ల తయారీ కోసం పలమనేరులోనే కాకుండా పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి వద్ద కూడా దాదాపు రెండు ఎకరాల స్థలంలో పట్టుపరిశ్రమ శాఖ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ కూడా కొన్ని భవనాలను నిర్మించారు. ఈ కేంద్రమూ మూత పడింది. ఇక పుంగనూరు- చౌడేపల్లె రహదారి పక్కనే ఏర్పాటు చేసిన పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం కూడా మూతపడింది.

ఈ కేంద్రాల కోసం ప్రత్యేకాధికారి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టుగుడ్ల తయారీ కోసం ఒక ప్రత్యేకాధికారిని పట్టుపరిశ్రమ శాఖ నియమించింది. ఆ అధికారి మదనపల్లెలో ఉంటూ ఈ కేంద్రాలను పరిశీలించేవారు. జిల్లాల పునర్విభజనతో మదనపల్లె అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేరింది. ఇప్పటికీ ఈ పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాల పర్యవేక్షణ మాత్రం అక్కడి అధికారి పరిధిలోనే ఉంది. ఇకనైనా పట్టుపరిశ్రమ శాఖ అధికారులు చొరవ చూపి పట్టుగుడ్ల తయారీ కేంద్రాలకు పూర్వవైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-03T01:28:17+05:30 IST