పోయిరావమ్మా పోలేరమ్మ
ABN , First Publish Date - 2023-10-06T01:02:59+05:30 IST
వెంకటగిరి పట్టణం జనసంద్రమైంది. గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ముఖ్య ఘట్టమైన అమ్మవారి విరూపోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలనుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పట్టణ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
వెంకటగిరి/వెంకటగిరి టౌన్, అక్టోబరు 5 : వెంకటగిరి పట్టణం జనసంద్రమైంది. గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ముఖ్య ఘట్టమైన అమ్మవారి విరూపోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలనుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పట్టణ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల మొక్కులు....మాంసపు విందులతో పట్టణం మోతెక్కిపోయింది. గురువారం తెల్లవారుజామున దేవస్థానం వద్ద వేపమండలతో పందిరి వేసి పోలేరమ్మను కొలువుదీర్చాక దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు బారులు తీరారు. పలువురు వేయికళ్ళ దుత్తల్లో వెలిగించిన ప్రమిదలను నెత్తిన పెట్టుకు వచ్చి నాలుగు కూడళ్లలో బద్దలు కొట్టారు. మడిచీరలపై ఆసాదుల తప్పెట్ల నడుమ నడుస్తూ అమ్మవారి వద్దకు కొందరు చేరుకోగా నవధాన్య మొలకలను అమ్మవారికి సమర్పించుకొని మరికొందరు మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం12గంటలకు నగరి ఆభరణాలైన బంగారు శూలం, సరుడును వెంకటగిరి రాజా అనుచరుల ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరించి తీసుకువెళ్ళారు.దీంతో వెట్టివారు కుండలో వెలిగించిన గండర దీపాన్ని అమ్మవారికి చూపించి దీపం ఆరకుండా ఊరి పొలిమేరల్లోకి తీసుకుపోయారు. అక్కడ అమ్మవారి బలి దున్నపోతును ఒక్క వేటులో తెగనరికి ఆ రక్తంతో పొలికుండల్లోని అన్నంతో కలిపి ఊరి పొలిమేరల్లో పొలి..పొలి అని అరుస్తూ చల్లారు.దున్నపోతు రక్తంతో తడిచిన కత్తిని అమ్మవారికి చూపిన తరువాత నగరిలో ప్రత్యేంగా పూలతో అలంకరించిన ట్రక్కును తీసుకు వచ్చి అమ్మవారి ప్రతిమను అందులో ఉంచారు.భక్తజనసందోహం నడుమ వెంకటగిరి పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు సాయంత్రం ప్రారంభమైంది.శివాలయం వద్దకు చేరుకున్న తరువాత అమ్మవారికి అలంకరించిన ఆభరణాలను తీసివేసి ప్రతిమను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌పై వుంచి కైవల్యానది మీదుగా మల్లయ్య తోట వద్ద ఏర్పాటు చేసిన విరూప మండపానికి తీసుకెళ్లారు.సాయంత్రం 7గంటల ప్రాంతంలో అక్కడ అమ్మవారి ప్రతిమను విరూపం గావించారు.అమ్మవారి ప్రతిమ మట్టిని ఇండ్లకు తీసుకెళ్లేందుకు పెద్దఎత్తున భక్తులు పోటీపడడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఒంటిగంట వరకు అలంకరించని ఆభరణాలు
పోలేరమ్మకు రాజాలు సమర్పించిన ఆభరణాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలంకరించనేలేదు. సాంప్రదాయం ప్రకారం దేవస్థానం వద్ద కొలువు దీరిన వెంటనే ఆ ఆభరణాలను అమ్మవారికి అలంకరిస్తారు. అయితే అవి బ్యాంకు లాకర్‌లో ఉంచడంతో అలంకరించడం మరిచిపోయారు. తరువాత భక్తులు గుర్తుచేయడంతో అమ్మవారి తాళి బొట్టును ప్రతిమకు ఏర్పాటు చేశారు.
అన్నీ తానై నడిపించిన రాంకుమార్
వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి జాతర వ్యవహారాలను అన్నీ తానై పర్యవేక్షించారు.అయితే పెదనాన్న నేదురుమల్లి పద్మనాభరెడ్డి బుధవారం సాయంత్రం మృతి చెందడం... ఆయన అంత్యక్రియలు కాక ముందే జాతరలో పాలుపంచుకోవడం విమర్శలకు దారితీసింది.
పోలీసుల అత్యుత్సాహం
జాతరలో పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.గురువారం తెల్లవారుజామునుంచే క్రాస్ రోడ్డువైపు నుంచి పట్టణంలోకి మోటర్ బైక్‌లు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసేశారు.వీఐపీ పాసులు లేకపోయినా తమ బంధువులను, స్నేహితులను వీఐపీ గ్యాలరీ గుండా తీసుకెళ్లి దర్శనం చేయించడం విమర్శలకు దారితీసింది. ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసులే తమ వాహనాలను రోడ్లపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. క్యూలైనులో మార్పులు చేయడం, పోలీసు బలగాలు అవసరానికి మించి పట్టణంలో మొహరించడంతో భక్తులు అమ్మవారిని ఊరేగింపులో దర్శించుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపడంతో దర్శన క్యూలు ఖాళీగా దర్శనమిచ్చాయి.రాజా నగరి వద్ద భక్తులను రానివ్వకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల జరిగిన తోపులాటలో పలువురు భక్తులతో పాటు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు తీసుకువచ్చిన నవధాన్య మొలకలను, వెయ్యి కళ్ల దుత్తలను అక్కడక్కడా పోలీసులు అడ్డుకోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
చీకట్లో అమ్మవారి రాత్రి ఊరేగింపు
పోలేరమ్మ ప్రతిమను అత్తవారిల్లుగా భావించే జీనుగుల వారి వీధి నుంచి సప్పరంపై ఉంచి విద్యుద్దీపాల, దివిటీల వెలుగుల్లో ఊరేగింపుగా తీసుకు రావాల్సి ఉంది. అయితే సప్పరం వెంకటేశ్వర థియేటర్ వద్దకు వచ్చే వరకు చీకట్లో ఊరేగించడం విమర్శల పాలైంది.