సర్వేశ్వరా.. నా సీటు సేఫేనా?
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:13 PM
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీలో అంతర్మథనం మొదలైంది.గెలుపు ధీమా బింకంగా మారింది. వైనాట్ 175 అన్నవారే ఆందోళన పడుతున్నారని ఇంచార్జిల మార్పు ప్రక్రియ ప్రారంభంతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలోనూ సిటింగ్ ఎమ్మెల్యేల్లో కొందరి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. సర్వేలు ఎవరి కొంప ఏ విధంగా ముంచుతాయో అనే ఆందోళన పెరుగుతోంది. ఇదే సందని ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి వర్గాలు గొంతు పెంచుతున్నాయి. జగన్ ముద్దు అంటూనే వీళ్లు మాత్రం వద్దు అనే నినాదం పెల్లుబుకుతోంది. మొత్తంమీద వైసీపీలో కొత్త కల్లోలం మొదలైంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీలో అంతర్మథనం మొదలైంది.గెలుపు ధీమా బింకంగా మారింది. వైనాట్ 175 అన్నవారే ఆందోళన పడుతున్నారని ఇంచార్జిల మార్పు ప్రక్రియ ప్రారంభంతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలోనూ సిటింగ్ ఎమ్మెల్యేల్లో కొందరి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. సర్వేలు ఎవరి కొంప ఏ విధంగా ముంచుతాయో అనే ఆందోళన పెరుగుతోంది. ఇదే సందని ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి వర్గాలు గొంతు పెంచుతున్నాయి. జగన్ ముద్దు అంటూనే వీళ్లు మాత్రం వద్దు అనే నినాదం పెల్లుబుకుతోంది. మొత్తంమీద వైసీపీలో కొత్త కల్లోలం మొదలైంది.
- తిరుపతి,ఆంధ్రజ్యోతి
నగరిలో రెండేళ్ళు డేంజర్ బెల్స్
నగరిలో రోజాకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరందుకుంది. నిజానికి రెండేళ్ల కిందటి నుంచే ఇక్కడ ఈ డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రోజాకు సొంత పార్టీలోనే బలమైన వ్యతిరేక వర్గం ఉంది. నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు, వడమాలపేట మండలాలన్నింటి లోనూ ప్రాబల్యం కలిగిన నాయకులు అభ్యర్థి మార్పు కోసం ఐక్యంగా పోరాడుతున్నారు. మంత్రి రోజాకు తప్ప తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా పరవాలేదని, పరస్పరం సహకరించుకుని గెలిపించుకుంటామని ఎప్పటి నుంచో అధిష్ఠానానికి చెబుతూనే వున్నారు. అలా కాని పక్షంలో కొత్తవారికి ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపిస్తామంటు న్నారు. తాజాగా వైసీపీలో ఇంఛార్జులు, అభ్యర్థుల మార్పుపై పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో నగరిలో పాత నినాదం మళ్ళీ ఊపందుకుంటోంది.రోజా వ్యతిరేక వర్గానికి ఇద్దరు మంత్రుల మద్దతు పుష్కలంగా వుందన్నది తొలినుంచీ ప్రచారంలో వుంది. ఇపుడు కూడా వారి మద్దతుతోనే రోజా వ్యతిరేక వర్గం రంగంలోకి దిగి జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం. ఇదే నిజం అయితే రోజాకు నచ్చజెప్పడమే పార్టీ అధిష్ఠానానికి పెద్ద సవాలుగా మారనుంది. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రోజా తనకు టికెట్ నిరాకరిస్తే తలొగ్గి మౌనంగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఏం జరగబోతోందనే టెన్షన్ రోజా అనుకూల, వ్యతిరేక వర్గాల్లో కొనసాగుతోంది.
సత్యవేడులో ఆదిమూలానికి అసమ్మతి పోటు
సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో బలమైన నాయకులు ఆయన పట్ల తీవ్ర విముఖతతో వున్నారు. తిరుపతిలో ఎంపీ విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశాలు నిర్వహించ డానికి సరిగ్గా పది రోజుల ముందే పిచ్చాటూరులో వెయ్యిమందితో భారీ ర్యాలీ నిర్వహించిన వ్యతిరేకవర్గం జగన్ ముద్దు... ఆదిమూలం వద్దు అంటూ బహిరంగంగా నినదించింది. ఆపై విజయసాయిరెడ్డితో సమావేశమైనపుడు కూడా ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సత్యవేడులో ఆదిమూలాన్ని మారుస్తారనే అంశం చర్చగా మారింది.
గూడూరులో కొత్త ముఖం తప్పదా?
గూడూరులో కూడా వచ్చే ఎన్నికలకు వైసీపీ నుంచీ కొత్త అభ్యర్థి పోటీలో వుంటారన్న ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యే వరప్రసాదరావు మాజీ ఐఏఎస్ అధికారనే సంగతి తెలిసిందే. అయితే ప్రజా సంబంధాల విషయంలో ఆయన గణనీయంగా వెనుకబడ్డారు.ఎమ్మెల్యే రాజకీయ నాయకు డిగా కాకుండా అధికారి తరహాలోనే వ్యవహరిస్తున్నారని, తమకు పనులు జరగడం లేదని నాయకులు అసంతృప్తితో వుంటున్నారు. ఎమ్మెల్యేపై నేరుగా అవినీతి ఆరోపణలు లేకపోయినా నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు యధేచ్చగా సిలికా దోపిడీకి పాల్పడుతున్నా చెక్ పెట్టలేకపోవడం కూడా ఆయనకు ప్రతికూలమవుతోంది. దీంతో ఆశావహుల ప్రయత్నాలూ ఇక్కడ పెరిగాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళీధరరావు, ఓ రెవిన్యూ అధికారి గట్టిగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
పేటలో సంజీవయ్య సంగతేంది?
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవయ్య మీద వైసీపీలో బహిరంగ పోరాటమే సాగుతోంది. ఇంత వ్యతిరేకత సొంత పార్టీలోనే ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి సహా పలువురు నేరుగానే సంజీవయ్యను వ్యతిరేకిస్తున్నారు. ఇంచార్జిల మార్పు వార్తలతో ఏకంగా సమావేశాలే పెట్టి ఘాటు ఆరోపణలకు దిగారు. ఇటు సంజీవయ్య వర్గం కూడా బలప్రదర్శనకు దిగింది. ఈ నేపథ్యమే సూళ్లూరుపేట సిటింగ్ ఎమ్మెల్యేకి మళ్లీ ఛాన్స్ దక్కకపోవచ్చనే ప్రచారానికి కారణమైంది. సూళ్లూరుపేట, గూడూరు స్థానాల్లో అభ్యర్ధిని మార్చాల్సి వస్తే బలమైన ప్రత్యామ్నాయం ఉండాలి. తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు కూడా ఈ రెండు చోట్లా వినిపించడం విశేషం.
వీళ్లు సేఫేనా?
తిరుపతిలో భూమన అభినయ్‌కీ, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికీ తిరుగుండదనే ప్రచారం ఉన్నా ప్రత్యర్ధి ఎవరనే దాన్నిబట్టే వీరి భవితవ్యం కూడా ఆధారపడి ఉందనే ప్రచారం జరుగుతోంది. తిరుపతిని జనసేనకు కేటాయిస్తే..జనసేనలోనూ అభ్యర్ది అధినాయకుడే అయితే..అనే ఊహాగానాల నేపథ్యంలో అభినయ్‌రెడ్డి పేరు ఊగిసలాడుతోంది. చంద్రగిరిలోనూ పులివర్తి నాని జోరు పెరిగిన తీరు చూసినవారు మోహిత్‌రెడ్డి సరిపోతారా అనే చర్చ చేస్తున్నారు.ఇక శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్ధుల విషయంలో ప్రమాద ఘంటికలు వినిపించడం లేదు.