పోటు కార్మికులకు జీతం పెంపు
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:26 PM
శ్రీవారి పోటు కార్మికులకు రూ.10 వేల దాకా వేతనం పెంచాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి వెల్లడించారు. శాశ్వత ఉద్యోగులు కానివారికి రూ.28 వేల జీతం అందుతోందని, అయితే వీరి సేవలను దృష్టిలో పెట్టుకుని రూ.38 వేలకు పెంచామన్నారు.వాహనబేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తిరుమలలో మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులతో కలిసి కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
పీస్‌రేట్ క్షురకులకు కనీసం వేతనం రూ.20 వేలు
3,518 మంది ఉద్యోగులకు రేపు ఇళ్లస్థలాల పంపిణీ
టీటీడీ బోర్డు నిర్ణయాలు
తిరుమల, డిసెంబరు26(ఆంధ్రజ్యోతి): శ్రీవారి పోటు కార్మికులకు రూ.10 వేల దాకా వేతనం పెంచాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి వెల్లడించారు. శాశ్వత ఉద్యోగులు కానివారికి రూ.28 వేల జీతం అందుతోందని, అయితే వీరి సేవలను దృష్టిలో పెట్టుకుని రూ.38 వేలకు పెంచామన్నారు.వాహనబేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తిరుమలలో మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులతో కలిసి కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచామన్నారు. స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, ఆన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుచి 15 వేలకు పెంచామని వివరించారు.జీవో 110 ప్రకారం కల్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్‌రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేల కనీస వేతనం చెల్లించేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఈనెల 28న 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలను పంపిణీ చేస్తామన్నారు. రెండో దఫా జనవరి మొదటివారంలో మరో 1,500 మందికి అందజేస్తామన్నారు. మూడో దఫాలో ఏర్పేడు మండలం పాగాలి వద్ద 350 ఎకరాల భూమి కోసం కలెక్టరును కోరామన్నారు. దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ప్రస్తుత ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందించినట్టవుతుందన్నారు. టీటీడీ భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుందన్నారు. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారన్నారు.అనంతరం భగవద్గీత, గోవిందకోటి పుస్తకాలతో పాటు స్థానిక ఆలయాల క్యాలెండర్లను ఆవిష్కరించారు.విద్యార్థుల్లో అవగాహన కల్పిచేందుకు సరళమైన భాషలో 20 పేజీలతో కూడిన లక్ష భగవద్గీత పుస్తకాలను టీటీడీ ముద్రించింది.తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ముద్రించిన ఈ పుస్తకాలను ఆయా రాష్ర్టాల్లో విద్యార్థులకు ఉచితంగా అందివ్వనున్నారు.అలాగే యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం రామకోటి తరహాలో గోవిందకోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. 200 పేజీలు కలిగిన ఒక పుస్తకం ధర రూ.111గా నిర్ణయించింది.ఒక్కో పుస్తకంలో 39,600 వంతున గోవిందనామాలు రాసిన వారికి శ్రీవారి బ్రేక్ దర్శనం, అలాగే 253 గోవింద కోటి పుస్తకాల్లో కోటి సార్లు రాసిన 25 ఏళ్లలోపు వారికి కుటుంబ సభ్యులు ఐదుగురితో కలిసి ఒకసారి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం, వసతి కల్పించనున్నారు.
మరికొన్ని నిర్ణయాలు
రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్‌రోడ్డులో గోగర్భం డ్యాం సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండరు ఆమోదం.
తిరుమలలోని హెచ్‌వీ ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరు ఖరారు.
తిరుపతిలోని శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో బస చేసే భక్తుల సౌకర్యార్థం తూర్పువైపు రూ.2 కోట్లతో ఓపెన్ డ్రైయిన్ నిర్మాణానికి నిర్ణయం.
తిరుమలలోని యాత్రికుల కాటేజీల్లో నివాసముంటున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం ప్రస్తుతమున్న పాత పోలీసు క్వార్టర్స్‌ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి చేసేందుకు టెండరు ఖరారు.
వరాహస్వామి విశ్రాంతి భవనం వద్ద అధిక ట్రాఫిక్ దృష్య్టా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.6.32 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
చెర్లోపల్లి నుంచి శ్రీనివాసమంగాపురం వరకు ఉన్న రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరణ, వీధిదీపాలు, డ్రైయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.17.29 కోట్లతో టెండరు ఖరారు.
చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రాకారం, కట్‌స్టోన్ ఫ్లోరింగ్, స్టోర్ గది మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.2 కోట్లు కేటాయించాలని నిర్ణయం.