రంకెలేస్తున్న కోడెగిత్త
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:08 AM
జిల్లాలో మొదలైన జల్లికట్టు జోరు
వెదురుకుప్పం, డిసెంబరు 17: కోడెగిత్త రంకెలేస్తోంది. రైతులు చేసిన అలంకరణలతో అల్లివైపు పరుగులు పెడుతోంది. నిలువరిస్తున్న యువకులకు చిక్కకుండా కదులుతోంది. సాహసంతో పట్టుకున్న యువకులకు కోడెగిత్తలకు కట్టిన బహుమతులు దక్కుతున్నాయి. ఇలా జల్లికట్టు జోరు మొదలైంది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏటా సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. పండుగ నెలంతా ఆయా ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహిస్తుంటారు. జిల్లాలో.. వెదురుకుప్పం మండలంలోని అత్యధిక గ్రామాల్లో జల్లికట్టు జరుగుతుంది. బ్రాహ్మణపల్లె, మొండివెంగనపల్లె, కురివికుప్పం, ఎగువగెరిగిదొన, దిగువ గెరిగిదొన, బందార్లపల్లె, చిన్నపోటుజేను, కోణంగిపల్లె, కొమరగుంట, దామరకుప్పం, అయ్యన్నగారిపల్లె, పెరుమాళ్లపల్లె, గొడుగుచింత, కొండకిందపల్లె, జీటీకండ్రిగ, ఎగువకన్నికాపురం, నచ్చుకూరు, నంబాలపల్లె, పొదలగుంట, మాంబేడు, పచ్చికాపల్లం, చవటగుంట ప్రాంతాల్లో ఏటా జల్లికట్టు నిర్వహిస్తుంటారు. జల్లికట్టు నిర్వహించే గ్రామాల్లో కోడెగిత్తలు లేకున్నా.. ఉన్న ప్రాంతాలకు వెళ్లి యజమానులకు తమలపాకు, వక్క (తాంబూలం) పెట్టి ఆహ్వానిస్తారు. ఆ కోడె గిత్తలకు అయ్యే ఖర్చులను నిర్వాహకులు భరిస్తారు. కొన్ని చోట్ల యజమానులే భరించుకుంటారు. జల్లికట్టు జరిగే గ్రామంలోని కోడెగిత్తలతో పాటు ఊరూరు నుంచి వచ్చిన కోడెగిత్తల కొమ్ములను చెక్కి, రంగులు దిద్ది, బెలూన్లు కడుతున్నారు. నాయకులు, దేవుళ్ల ఫొటోల ఆకృతులతో పట్టీలు (బహుమతులు) కడతారు. కొన్నింటి కొమ్ములకు టవళ్లు కట్టి అందులో రూ.1000 నుంచి డబ్బులు కూడా పెడతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు ‘అల్లి’లో నిలబడి బహుమతుల కోసం గిత్తలను నిలువరిస్తారు. చూడటానికి వచ్చిన జనం మాత్రం మిద్దెలు, గోడల మీద ఉంటారు. బహుమతి విలువతో పని లేకుండా దక్కించుకున్నామా? లేదా? అన్నదే జల్లికట్టులో ప్రత్యేకత. పట్టీలు దక్కించుకున్న యువకులు సంతోషంతో కేరింతలు కొడుతూ వెళ్తారు. నిలువరించే క్రమంలో ఎడ్ల కింద పడి గాయాలైన వారూ ఉన్నారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు జరుగుతోంది.
జనసంద్రంగా జల్లికట్టు గ్రామాలు
గతంలో ప్రసార మాధ్యమాలు లేకపోవడంతో తక్కువ సంఖ్యలో జనం వచ్చేవారని, ఇంత ఆర్బాటం ఉండేది కాదని పెద్దలు అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాతో వివిధ ప్రాంతాలకు జల్లికట్టు సమాచారం చేరుతోంది. దీంతో ఆ మండలంలోని గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ జనం వేలాదిగా వస్తున్నారు. దీంతో జల్లికట్టు నిర్వహించే గ్రామం జనసంద్రంగా మారుతోంది. మొదట్లో సంక్రాంతి పండుగల్లో పశువుల పండగ రోజున ఆయా గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించే వారు. కొన్నేళ్లుగా సంక్రాంతి పండగ నుంచి జనవరి చివరి వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ధనుర్మాసం మొదలు కాక ముందే.. ఈనెల 10వ తేదీన ఎస్‌ఆర్‌పురం మండలం ఎన్‌ఎన్‌డీపురం అలియాస్ మంగణాంపల్లెలో జల్లికట్టు మొదలుపెట్టారు. తాజాగా ఆదివారం వెదురుకుప్పం మండలం గోవిందవారిపల్లెలో జల్లికట్టు జరిగింది. ఇక నుంచి తరచూ ఆయా గ్రామాల్లో జల్లికట్టు జరుగుతూ ఉంటుంది.
తమిళనాడులో ఇలా..
తమిళనాడులో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగదీసుకునే ఒక ఆట ఇది. కనుమ పండగ రోజున ప్రధానంగా నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరులో నిర్వహిస్తారు. దీన్నే మంజు విరాట్టు అని కూడా పిలుస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం. కొన్ని తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో యువతులు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారని కూడా ప్రచారంలో ఉంది. పాలసముద్రం మండలం సరిహద్దులో ఉన్న తమిళనాడు ప్రాంతాలైన ఆరణి, రామనాథపురం, వంజాపురం, రాణిపేటలో సంక్రాంతి పండగ మరుసటి రోజున నిర్వహించడం పరిపాటి. మన జిల్లా నుంచీ అధిక సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు.
గోవిందవారిపల్లెలో జల్లికట్టు జోష్
వెదురుకుప్పం మండలం కొమరగుంట పంచాయతీ గోవిందవారిపల్లెలో ఆదివారం జరిగిన జల్లికట్టు యువకుల్లో జోష్ నింపింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆ గ్రామానికి కోడెగిత్తలతో యజమానులు, చూడటానికి జనం తరలివచ్చారు. కోడెగిత్తల కొమ్ములను అలంకరించి, వాటికి వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఫొటోలతో పాటు, వివిధ రకాల దేవుళ్లు, కోడె గిత్తల యజమానుల ఫొటోలతో కూడిన పట్టీలను కట్టారు. గిత్తలను అల్లి వైపు వదిలారు. వీటిని నిలువరించేందుకు యువకులు ప్రయత్నించారు. చాలా గిత్తలు వీరికి చిక్కకుండా పరుగులు తీశాయి. తమకు చిక్కిన గిత్తల నుంచి యువకులు పట్టీలను దక్కించుకున్నారు. పట్టీలు దక్కించుకునే క్రమంలో ‘నాదంటే.. నాదే’ అంటూ వాదోపవాదాలు జరిగాయి. గిత్తలను నిలువరించే క్రమంలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఒక దశలో గిత్తలు జనంపైకి దూసుకుని రావడంతో భయాందోళనకు గురయ్యారు. జల్లికట్టు చూసేందుకు వచ్చిన జనం మిద్దెలు, గోడలు, ఆలయం మీదకు ఎక్కారు.