వచ్చే నెలాఖరులోగా టిడ్కో గృహాల రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2023-05-26T00:42:10+05:30 IST

ఎట్టకేలకు టిడ్కో గృహాల అంశంలో కదలిక వచ్చింది. టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రాంత పేద ప్రజలకు మూడు రకాల టిడ్కో గృహాలను నిర్మించింది.

వచ్చే నెలాఖరులోగా టిడ్కో గృహాల రిజిస్ర్టేషన్లు
కళకళలాడుతున్న సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం

ప్రారంభమైన రూపాయి రిజిస్ర్టేషను

చిత్తూరు కలెక్టరేట్‌, మే 25: ఎట్టకేలకు టిడ్కో గృహాల అంశంలో కదలిక వచ్చింది. టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రాంత పేద ప్రజలకు మూడు రకాల టిడ్కో గృహాలను నిర్మించింది. ఈ క్రమంలో చిత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పూనేపల్లె వద్ద టిడ్కో గృహాలను నిర్మించారు. పంపిణీ చేసే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ టిడ్కో గృహాల పంపిణీ మీద శీతకన్ను వేసింది. ఏళ్లుగా లబ్ధిదారులు తమ ఇళ్ల కోసం వేచి చూస్తున్నారు. మూడు రకాల ఇళ్లలో ప్రస్తుతం రూ.1 కే రిజిస్ర్టేషన్లు చేసి గృహాలను లబ్ధిదారులకు అందిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 600 గృహాల రిజిస్ర్టేషన్లు జరగనున్నాయి. లబ్ధిదారుల పేరిట వీటిని రిజిస్ర్టేషన్లు చేసి ఇవ్వాలని కమిషనర్‌ అరుణ ఇటీవల జిల్లా రిజిస్ర్టార్‌ను కలిసి కోరారు. రోజుకు 30 నుంచి 40 గృహాల రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ఇతర డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్లకు ఇబ్బంది కలగకుండా టిడ్కో గృహాల రిజిస్ర్టేషన్లు ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో చేస్తున్నారు. మంగళవారం 26, బుధవారం 42, గురువారం 30 ఇళ్లకు రిజిస్ర్టేషన్లు జరిగాయి. వీరికి స్టాంపు డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం కల్పించింది. రిజిస్ర్టేషన్ల ప్రక్రియ జూన్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ షన్మోహన్‌ ఇటీవల అధికారులకు ఆదేశించారు.

Updated Date - 2023-05-26T00:42:10+05:30 IST