వైసీపీ కౌన్సిలర్ల తిరుగుబాటు!
ABN , First Publish Date - 2023-09-26T01:47:53+05:30 IST
కుప్పంలో అధికార పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. వార్డుల్లో అభివృద్ధి జరగడంలేదంటూ సోమవారం మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.

కుప్పం,సెప్టెంబరు 25: కుప్పంలో అధికార పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. వార్డుల్లో అభివృద్ధి జరగడంలేదంటూ సోమవారం మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. మొత్తం 19 మంది వైసీపీ కౌన్సిలర్లలో ఐదుగురు స్వయంగా.. మరో ఐదుగురి బంధువులు.. ఇలా పది మంది ఆందోళనలో పాల్గొన్నారు. మరికొందరు బహిరంగంగా బయటకు రాకున్నా.. వెనకుండి మద్దతు పలికారు. పట్టణంలో మురుగు నీటి కాలువలు నిర్మిస్తామంటూ వీధులను తవ్వేశారు. నెలలు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆగిపోయాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో ఇలా ఆందోళన తెలిపారు. మున్సిపల్ అధికారుల్లో సగానికి పైగా ముఖ్యులైనవారు దూర ప్రాంతాలనుంచి కార్యాలయానికి వారికి ఇష్టమొచ్చినపుడు వచ్చి వెళ్తారని, ఛైర్మన్‌ను అడిగితే తనకు తెలియదని చేతులెత్తేస్తారని అన్నారు. కనీసం మున్సిపల్ సమావేశం నిర్వహించి నాలుగు నెలలకు పైగా అవుతోందన్నారు. అందుకే ప్రజలకు పనులు చేయలేని కార్యాలయం ఎందుకని తాళాలు వేశామన్నారు.