కుప్పంలో అభివృద్ధి మేడిపండు
ABN , First Publish Date - 2023-09-26T01:45:02+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో, ముఖ్యంగా పురపాలక సంఘంలో అభివృద్ధి అనేది మేడిపండులా తయారైందని స్పష్టమైపోయింది. ఈ వాస్తవాన్ని అధికార పార్టీ కౌన్సిలర్లే బయటపెట్టారు.

కుప్పం, సెప్టెంబరు 25: వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో, ముఖ్యంగా పురపాలక సంఘంలో అభివృద్ధి అనేది మేడిపండులా తయారైందని స్పష్టమైపోయింది. ఈ వాస్తవాన్ని అధికార పార్టీ కౌన్సిలర్లే బయటపెట్టారు. వార్డుల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనికూడా జరగడంలేదంటూ మున్సిపల్ కార్యాలయానికి సోమవారం తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీలోని ఓ వర్గం కౌన్సిలర్లు చేపట్టిన ఈ నిరసన నేపథ్యంలో ఆ పార్టీలో సాగుతున్న వర్గపోరు కారణమైనా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి వీసమెత్తు కూడా లేదని దీతో తేలిపోయింది.
కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు 19 మంది వైసీపీ.. ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లలో ఏకంగా 10 మంది సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేశారు. ఈ పదిమందిలో స్వయంగా కౌన్సిలర్లు కొంతమంది ఉండగా, మరికొంతమంది ఆయా కౌన్సిలర్ల భర్తలు, కొడుకులు ఉన్నారు. 1, 2, 3, 23, 24 కౌన్సిలర్లు జగదీశ్, మునిరాజు, అరవింద్, రాజ్‌కుమార్, సయ్యద్ అలీ నేరుగా నిరసనలో పాల్గొన్నారు. 6, 13, 21 వార్డుల కౌన్సిలర్ల భర్తలు జయంతి ఇళయరాజా, హంస సోము, లావణ్య సురేశ్, 4, 25 వార్డు కౌన్సిలర్లు రాజమ్మ, మంజుల కుమారులు రవి, మణి నిరసన తెలిపారు. వైసీపీకే చెందిన మరో ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు వీరి ఆందోళనకు మద్దతు తెలిపారు. తొలుత కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేశారు. కార్యాలయం ముందు నిలబడి నిరసన తెలిపారు. తమ వార్డుల్లో ఒక్క పనీ జరగడంలేదని, తమమీద కావాలనే వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. విచిత్రమేమంటంటే వీరి నిరసన ఎవరిమీదనో స్పష్టంగా తెలియకపోవడం. మున్సిపల్ ఛైర్మన్‌ను ప్రస్తావించినా, ఆయన కనీసం సమావేశాలు నిర్వహించడంలేదన్న ఫిర్యాదుతోనే సరిపెట్టారు. ఆయనను అడిగితే తనకు ఏమీ తెలియదని చేతులెత్తేస్తున్నారంటూ వాపోయారు. అంటే మున్సిపల్ ఛైర్మన్‌కు మించిన శక్తులేవో తమ వార్డుల్లో కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్న ఆరోపణ వారిది.
పరాకాష్టకు చేరిన వర్గపోరు
కుప్పం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఆయా మండల నాయకుల్లో కొందరికి, ఎమ్మెల్సీ భరత్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అప్పుడప్పుడూ అసంతృప్తవాదులు రోడ్డెక్కుతున్నారు. శాంతిపురం మండలం మొరసనపల్లె సర్పంచి జగదీశ్, ఒక భూవివాదం విషయంలో ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రోడ్డుపై నిలేశారు. అంతకుముందు ఇదే విషయాన్ని ఎమ్మెల్సీకి చెప్పినా పట్టించుకోక, అవతలి వ్యక్తికి మద్దతుగా నిలిచారన్న కారణంతో ఈ వివాదం ఇంతదాకా వచ్చింది. అలాగే కుప్పం పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్సీ భరత్‌కు, రెస్కో ఛైర్మన్ సెంథిల్‌కుమార్‌కు మధ్య విభేదాలున్న విషయం బహిరంగ రహస్యం. ఈ విభేదాల నేథ్యంలో అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. అందువల్లనే తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేయడంలేదని సెంథిల్ వర్గానికి చెందిన కౌన్సిలర్ల ప్రధాన ఫిర్యాదు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేయడం, నిరసన తెలపడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకు దిగిన కౌన్సిలర్లలో అధిక శాతం మంది సెంథిల్ వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.
పేరుకే రూ.66 కోట్లు
అధికార పార్టీ కౌన్సిలర్ల నిరసనల నేపథ్యం అధికార పార్టీలోని వర్గ విభేదాలే అయినా వారు అభివృద్ధి జరగడంలేదని చేసిన ఫిర్యాదులో కూడా పక్కా వాస్తవాలు ఉన్నాయి. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏకంగా రూ.66 కోట్లు మంజూరు చేశామని అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా గొప్పగా ప్రకటించారు. ఆ నిధులతో చేపట్టాల్సిన పనుల జాబితానూ మున్సిపల్ కౌన్సిల్‌లో పొడవుగా తయారు చేశారు. అత్యుత్సాహంతో అక్కడక్కడా మురుగునీటి కాలువలు నిర్మించేస్తామంటూ రోడ్లకు ఇరుపక్కలా తవ్వి విడిచిపెట్టారు. గుంతలు తవ్వి నెలలు గడుస్తున్నా చాలాచోట్ల కాలువల నిర్మాణం జరగలేదు. ప్రజలు నానారకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ అభివృద్ధి పనులు జరగకపోవడంలో కూడా తమ వార్డుల్లోనే ఎక్కువగా ఉందన్నది సెంథిల్ వర్గం కౌన్సిలర్ల ఆరోపణ.
మాకూ 195 జరిగుండవు
అధికార పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసిన విషయం తెలిసి కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. తాళాలు వేసి ఉండటంపై ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ అసహనంలో కొన్ని వాస్తవాలు మాట్లాడారు. ‘పని కావాలంటే నెక్ట్స్ మీరేం చేసుకోవాలో అది చేసుకోండంతే. అట్లాగని పని జరగలేదని లాక్ చేసుకుంటే, మాకూ 195 జరిగుండవు. ప్రతివొక్కరికీ బయట ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పనులు జరగవు. పనులు జరక్కపోతే యు కాంట్ లాక్. ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు’ అని కౌన్సిలర్లను సీఐ శ్రీధర్ హెచ్చరించారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయానికి వేసిన తాళాన్ని స్వయంగా తొలగించి, నిరసన చేస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్లను స్టేషన్‌కు తరలించారు.