బడ్జెట్‌ కౌన్సిల్లో రచ్చ రచ్చ!

ABN , First Publish Date - 2023-03-26T02:18:48+05:30 IST

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశం రచ్చరచ్చగా సాగింది.

బడ్జెట్‌ కౌన్సిల్లో రచ్చ రచ్చ!
టీడీపీ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణపైకి దూసుకొస్తున్న వైసీపీ కార్పొరేటర్లు

టీడీపీ కార్పొరేటర్‌పైకి దూసుకొచ్చిన వైసీపీ కార్పొరేటర్లు

మీడియాను రానివ్వకుండా తలుపులేసిన సిబ్బంది

మౌనం దాల్చిన మేయర్‌, ఎమ్మెల్యే

తిరుపతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశం రచ్చరచ్చగా సాగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.395కోట్ల బడ్జెట్‌ అంచనాలతో కౌన్సిల్‌ తీర్మానం కోసం శనివారం ఎస్వీయూ సెనేట్‌ హాల్లో ప్రత్యేక సమావేశం జరిగింది. కార్పొరేషన్‌ మేనేజర్‌ చిట్టిబాబు బడ్జెట్‌ అంచనాల గురించి మాట్లాడుతుండగానే డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ వివాదానికి తెరలేపారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో రుణమాఫీ సొమ్ము సకాలంలో చెల్లించకుండా మహిళలను ఇబ్బందిపెట్టారని, నారా లోకేశ్‌ పాదయాత్ర వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, జగన్మోహన్‌ రెడ్డి అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ పైకి లేచి బడ్జెట్‌ సమావేశంలో రాజకీయ ఆరోపణలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ప్రత్యేకంగా మాట్లాడుకుందామని, బడ్జెట్‌ సమావేశం పూర్తికానివ్వాలని తీవ్ర స్వరంతో చెప్పారు. ‘డిప్యూటీ మేయర్‌గా నేను ఎప్పుడైనా మాట్లాడతా, అడిగేందుకు నువ్వెవరు? నీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకో’ అంటూ ముద్రనారాయణ వాదనకు దిగారు. ఇంతలో ఒక్కసారిగా ఐదారుగురు వైసీపీ కార్పొరేటర్లు ఆర్సీ మునికృష్ణ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెయిటింగ్‌ రూంలో ఉన్న మీడియా ప్రతినిధులంతా వారి అరుపులు విని లోపలికి వెళ్లారు. అయితే కమిషనర్‌ ఆదేశాలతో మీడియాను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులకు, కార్పొరేషన్‌ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశానికి అనుమతి లేనప్పుడు ఎందుకు ఆహ్వానించి అవమానిస్తారని మీడియా సిబ్బంది ప్రశ్నించారు. సమావేశం ప్రారంభమైన పది నిమిషాల వరకు ఉండొచ్చని ప్రకటన ఇచ్చి రెండు నిమిషాలు కూడా ఉండనీయకుండా, కనీసం బడ్జెట్‌ ప్రతులను కూడా ఇవ్వకుండా సమావేశానికి పిలవడంపై అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు కాని పార్టీ నాయకులను మాత్రం ఎందుకు అనుమతిస్తారని ప్రశ్నించినప్పటికీ మీడియాకు సమాధానం చెప్పలేక నీళ్లునమిలారు. మీడియాను బయటకు పంపి, తలుపులు వేసుకుని బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించడమేంటని టీడీపీ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ మండిపడ్డారు. తనపై దాడికి ప్రయత్నించినా బెదిరేది లేదన్న ఆయన పోడియం ముందు నిరసనకు దిగేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. కొద్దిసేపటి తర్వాత వివాదం సద్దుమణగడంతో పది నిమిషాల్లోనే బడ్జెట్‌ అంచనాల హైలెట్స్‌ను చదివేసి ముగించేశారు. ఇంత జరుగుతున్నా మేయర్‌ శిరీష, ఎమ్మెల్యే కరుణాకర రెడ్డిలు స్పందించకుండా మౌనందాల్చారు. శెట్టిపల్లి పంచాయితీ కార్పొరేషన్లో విలీనం కావడంపై మేయర్‌ అభినందనలు తెలిపారు.

ఖాళీ స్థలాలకు పన్నులు వేయండి

పేదలు పన్నులు చెల్లించడం ఆలస్యమైతే కుళాయి కట్‌ చేస్తాం, కరెంట్‌ పీకేస్తామని కార్పొరేషన్‌ అధికారులు బెదిరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మరి కోట్ల రూపాయల విలువచేసే ఖాళీ స్థలాలకు పన్నులు ఎందుకు వసూలు చేయడంలేదని కార్పొరేటర్‌ ఎస్కే బాబు కౌన్సిల్లో ప్రశ్నించారు. ఖాళీ స్థలాల విషయంలో కూడా పేదోళ్లను ఇబ్బందిపెట్టకుండా ధనవంతుల చేత పన్నులు కట్టించేలా చూడాలని సూచించారు. లేకుంటే సదరు స్థలాల్లో కార్పొరేషన్‌ బోర్డులు ఏర్పాటుచేస్తే వారే దిగివస్తారని చెప్పారు. డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ, కార్పొరేటర్‌ రామస్వామి వెంకటేశ్వర్లు ఈ అంశంపై కమిషనర్‌ స్పందించాలని కోరారు. ఖాళీ స్థలాలను గుర్తించి పన్నులు వేస్తామని, అదేవిధంగా పన్నులు చెల్లించని స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని కోరుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ను కోరుతామని కమిషనర్‌ అంజలి తెలిపారు. నగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇంటినిర్మాణ దరఖాస్తులకు డెవల్‌పమెంట్‌ ఛార్జీలు 14శాతాన్ని నిబంధనల మేరకు వసూలు చేస్తే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని మరో కార్పొరేటర్‌ శేఖర్‌ రెడ్డి చెప్పారు. కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, ఏడీసీ సునీత, డీసీ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఈ మోహన్‌, రెవెన్యూ ఆఫీసర్‌ కె.ఎల్‌.వర్మ, కార్యదర్శి రాధిక తదితరులు పాల్గొన్నారు.

==========================

Updated Date - 2023-03-26T02:18:48+05:30 IST