‘కండలేరు’ నీటికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2023-08-12T01:20:13+05:30 IST
నెల్లూరు జిల్లా కండలేరు నుంచి చామంతిపురం రిజర్వాయర్‌కు 5 టీఎంసీల నీటిని పైపులైన్ ద్వారా తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 11: నెల్లూరు జిల్లా కండలేరు నుంచి చామంతిపురం రిజర్వాయర్‌కు 5 టీఎంసీల నీటిని పైపులైన్ ద్వారా తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన జరిగిన పలమనేరు, చిత్తూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తద్వారా చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. పలమనేరు నియోజకవర్గంలోని కైగల్, గంగమ్మ శిరస్సు, గంగమ్మ ఏరు రిజర్వాయర్లకు సంబంధించి ఇది వరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, వీటి అనుమతుల కోసం అధికారులు చొరవ చూపాలన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, కట్టమంచి వై జంక్షన్ రోడ్డు, చిత్తూరు-పుత్తూరు రోడ్డు, చిత్తూరు- గుడిపాలలో కొత్త శ్మశానవాటికల కోసం భూ సేకరణ తదితర సమస్యలపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివేదిక అందించారు. పలమనేరు మండలం సంబరపూర్ రోడ్డుకు అటవీశాఖ అనుమతులను ఇవ్వాలని, వి.కోట ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్పు చేయాలని ఎమ్మెల్యే వెంకటే గౌడ కోరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ షన్మోహన్, మేయర్ అముద, జేసీ శ్రీనివాసులు, చుడా చైర్మన్ పురుషోత్తంరెడ్డి, డిప్యూటీ మేయర్ రాజే్‌షకుమార్‌రెడ్డితో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, కమిషనర్లు పాల్గొన్నారు.
మీడియాకు నో ఎంట్రీ:
ఈ సమావేశంలో ఐఅండ్‌పీఆర్ శాఖ అధికారులు మీడియాకు అనుమతి ఇవ్వలేదు. కానీ వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.