ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం..!

ABN , First Publish Date - 2023-06-01T01:31:14+05:30 IST

ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఒక వైపు మండుటెండలు ఉన్నా, మరో వైపు అకాల వర్షాలు రావడంతో సేద్యంపై రైతుల ఆశలు చిగురించాయి.

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం..!

చిత్తూరు (సెంట్రల్‌), మే 31: ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఒక వైపు మండుటెండలు ఉన్నా, మరో వైపు అకాల వర్షాలు రావడంతో సేద్యంపై రైతుల ఆశలు చిగురించాయి. జిల్లాలో 90 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో 2.22 లక్షల మంది రైతులు 23 రకాలైన పంటలు సాగు చేయనున్నారు. ఖరీ్‌ఫలో ప్రధాన పంట వేరుశనగ. గత నెలలో కురిసిన వర్షాలతో పలు మండలాల్లో రైతులు దుక్కి దున్ని పొలాలను సాగుకు సిద్ధం చేసుకున్నారు. జూన్‌ నెల రెండో వారం నుంచి వర్షాలు కురుస్తాయని భావించిన రైతులకు అందుకు అనుగుణంగా సాగు చేసేందుకు యత్నాలు చేస్తున్నారు. రెండేళ్లుగా కురిసిన వర్షాల కారణంగా పలు గ్రామాల్లో బావుల కింద నీటి ఆధారిత పంటలు సాగు చేయడానికి రైతులు ఇప్పటికే సమాయత్తమయ్యారు. పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట, కుప్పం ఈ ప్రాంత రైతులు ఉద్యాన, పువ్వులు, పట్టు తదితర రకాల సాగుపై మొగ్గు చూపుతున్నారు.

23 రకాలైన పంటల సాగు

ఖరీ్‌ఫలో 91,441 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో దాదాపు 23 రకాలైన పంటలు సాగు చేయనున్నారు. ప్రధాన పంటగా చెప్పుకునే వేరుశనగ 51,266 హెక్టార్లు కాగా, వరి 9019, చెరకు 9824, పశుగ్రాసం 6412 రాగి 3758, కందులు 3920, ఉలవలు 3370, అనుములు 841, ఆముదం, మొక్కజోన్న 422, బాజ్రా 517, కొర్రలు 43, సాములు 210, పెసలు 211 తో పాటు పత్తి, పొద్దుతిరుగుడు వంటి మరిన్ని రకాల పంటలు సాగు చేయనున్నారు.

502 ఆర్‌బీకేలో సదుపాయాలు: జిల్లాలోని 502 రైతు భరోసా కేంద్రాల్లో ఖరీఫ్‌ సీజన్‌కు 14,152 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. 244 ఆర్‌బీకేల్లో రైతులకు అవసరమైన పరికరాలు అద్దెకు ఇవ్వనున్నారు.

విత్తనాలు పంపిణీ: 42,350 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలతో పాటు 160 టన్నుల రాగి, 290 క్వింటాళ్ల కందులు, 36 క్వింటాళ్ల పెసలు, వెయ్యి క్వింటాళ్ల ఉలవలు, 1394 క్వింటాళ్ల పచ్చరొడ్డి విత్తనాలు వ్యవసాయ శాఖ అందజేయనుంది.

Updated Date - 2023-06-01T01:31:14+05:30 IST