పెద్దిరెడ్డి వ్యూహానికి బీటలు

ABN , First Publish Date - 2023-03-18T23:53:10+05:30 IST

జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ పక్షాన నైతిక, భౌతిక, ఆర్థిక బాధ్యతలు తీసుకుంటున్నది తొలి నుంచీ పెద్దిరెడ్డి కుటుంబమే.తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పరాజయం మంత్రి పెద్దిరెడ్డి బలానికి ఈ నాలుగేళ్లలో ఎదురైన తొలి దెబ్బగా భావిస్తున్నారు.

పెద్దిరెడ్డి వ్యూహానికి బీటలు

భూమన, చెవిరెడ్డి ఎన్నికల నిర్వహణ సామర్థ్యం మీదా అనుమానాలు

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పరాజయం మంత్రి పెద్దిరెడ్డి బలానికి ఈ నాలుగేళ్లలో ఎదురైన తొలి దెబ్బగా భావిస్తున్నారు. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ పక్షాన నైతిక, భౌతిక, ఆర్థిక బాధ్యతలు తీసుకుంటున్నది తొలి నుంచీ పెద్దిరెడ్డి కుటుంబమే. తిరుపతి, చంద్రగిరి వంటి ఒకటి రెండు నియోజకవర్గాలు మాత్రమే దీనికి మినహాయింపు. మిగిలిన సెగ్మెంట్లలో పెద్దిరెడ్డి పెద్దరికం కిందనే ఆయా ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పని చేస్తుంటారు. ఎన్నికల నిర్వహణలో విశేష అనుభవం ఆయనకుంది.. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా వైసీపీ అధిష్ఠానం గెలుపు బాధ్యతలను ఆయనకే కట్టబెడుతూ వస్తోంది. ముఖ్యంగా మూడున్నరేళ్ళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు గానీ, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు గానీ ఆయన ముద్రతోనే జరిగాయి. వైసీపీకి ఘనం విజయం సాధించి పెట్టాయి. అనంతపురం జిల్లా ఇంఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి, కడప జిల్లాలో ఆయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఎన్నికల వ్యవహారాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. దానికి తగ్గట్టే ఆయా ఎన్నికల్లో గెలుపు సాధిస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అందరి అంచనాలూ తారుమారయ్యాయి. భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ ఘన విజయం సాధించారు. ఈ పరిణామాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పెద్దిరెడ్డి అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్ఠానం వద్ద ఎదురులేని పలుకుబడి ఉన్న తమ నేత ప్రతిష్ట దెబ్బతింటే ఎలా? అన్న ప్రశ్న వారిని సతమతం చేస్తోంది. ఇక పెద్దిరెడ్డితో ప్రమేయం లేకుండా నేరుగా అధిష్ఠానం వద్ద పలుకుబడి కలిగిన తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దాదాపు ఇలానే మారినట్టు సమాచారం. అధిష్ఠానానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆ ఇద్దరు నేతలు కూడా తర్జనభర్జన పడుతున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరిలో తిరుపతి ఎమ్మెల్యే నియోజకవర్గం వరకే పరిమితం అవుతుండగా, చంద్రగిరి ఎమ్మెల్యే మాత్రం ఎన్నికల స్పెషలిస్టు లేదా అధిష్ఠానం అప్పగించే ఏ టాస్క్‌ అయినా విజయవంతంగా అమలు చేసి చూపే నేతగా గుర్తింపు పొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయన బయట జిల్లాల్లో కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. అలాంటిది ఆయన వ్యూహాలు కూడా పనిచేసినట్టు కనిపించడం లేదు. టీడీపీ ఘన విజయంతో ఈ నేతలు, వారి అనుచరవర్గాలూ ఓవైపు మధనపడుతుండగా మరోవైపు సొంత పార్టీలోనే అంతర్గతంగా వారిని వ్యతిరేకించే వర్గాలు మాత్రం సంబరపడుతున్నట్టు సమాచారం.

Updated Date - 2023-03-18T23:53:10+05:30 IST