సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెండింగ్‌ ప్రాజెక్టులూ పూర్తిచేస్తా

ABN , First Publish Date - 2023-06-26T01:49:36+05:30 IST

‘సూళ్లూరుపేట నియోజకవర్గానికి జగన్‌ అనేక హామీలిచ్చాడు. తెలుగుగంగ కాలువ పూర్తి చేస్తానని.. పులికాట్‌లో పూడికతీత.. చెంగాళమ్మ వద్ద కాళంగి నదిపై బ్రిడ్జి నిర్మాణం అన్నాడు. సైకో జగన్‌ ఒక్కటైనా చేసి.. మాట నిలబెట్టుకున్నాడా? మేము అధికారంలోకి రాగానే ఈ మూడు పనులు పూర్తిచేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.

 సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెండింగ్‌ ప్రాజెక్టులూ పూర్తిచేస్తా
బహిరంగ సభలో పిడికిలి బిగించిన లోకేశ్‌

నాయుడుపేట/ తిరుపతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘సూళ్లూరుపేట నియోజకవర్గానికి జగన్‌ అనేక హామీలిచ్చాడు. తెలుగుగంగ కాలువ పూర్తి చేస్తానని.. పులికాట్‌లో పూడికతీత.. చెంగాళమ్మ వద్ద కాళంగి నదిపై బ్రిడ్జి నిర్మాణం అన్నాడు. సైకో జగన్‌ ఒక్కటైనా చేసి.. మాట నిలబెట్టుకున్నాడా? మేము అధికారంలోకి రాగానే ఈ మూడు పనులు పూర్తిచేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. పెండింగ్‌ ప్రాజెక్టులూ పూర్తి చేస్తా’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని మేనకూరు విడిది శిబిరం నుంచి 137వ రోజు యువగళం పాదయాత్రను ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా నాయుడుపేట గాంధీసెంటర్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘స్వర్ణముఖి, కాళంగి నదులున్నా నియోజకవర్గ దాహార్తి తీర్చడం వైసీపీ వారికి చేతకాలేదు. సూళ్లూరుపేటలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు కడతామని మోసం చేశారు. కాళంగి నదిలోకి సముద్రపు బ్యాక్‌ వాటర్‌ వచ్చి నీరు ఉప్పుగా మారడంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి రాగానే వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నీటి కొళాయి ఇస్తాం. టిడ్కో ఇళ్లను మొదటి వందరోజుల్లో పూర్తిచేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటా. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాల్టీల్లో అభివృద్ధి గుండుసున్నా. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదవారిని వేధించారు. నేను వస్తుంటే చంద్రబాబు నాయుడిని కించపరిచేలా ఫ్లెక్సీలు పెట్టారు. తగ్గేదేలేదు. వైసీపీ నాయకుల వేధింపులకు గురైన పసుపు సైన్యాన్ని గుండెల్లో పెట్టుకుంటా. అరాచకశక్తులు సూళ్లూరుపేటలో ఉన్నా.. సింగపూర్‌లో ఉన్నా తీసుకొచ్చి లోపలేస్తా’ అని యువనేత హెచ్చరించారు.

చాప చుట్టేస్తున్న సూళ్లూరుపేట కమలహాసన్‌

‘భారీ మెజారిటీతో సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా సంజీవయ్యను గెలిపించారు. ఏమైనా మారిందా.. ఒక్క దళితుడికైనా న్యాయం జరిగిందా..’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. ‘గంజాయి, గుట్కా, లిక్కర్‌ దందా, క్రికెట్‌ బెట్టింగ్‌కు సూళ్లూరుపేటను అడ్డాగా మార్చేశారు. ఆయన్ను నియోజకవర్గంలో ముద్దుగా కమలహాసన్‌ అని పిలుస్తారట. ఎందుకంటే.. ఊరంతా తిరిగి హామీలిచ్చి, రేపటికి మరిచిపోతాడట. కమలహాసన్‌ అనుచరుడు అనిల్‌ కుమార్‌ రెడ్డి.. క్రికెట్‌ బెట్టింగ్‌, గంజాయి మాఫియాని నడుపుతున్నాడు. క్రికెట్‌ బెట్టింగ్‌లో ఎనిమిది నెలలు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. సంజీవయ్య తన అనుచరులతో కలసి శ్రీసిటీ బోర్డర్‌లో పేకాట క్లబ్బులు కూడా నిర్వహిస్తున్నాడు. కరోనాను కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నారు. శ్రీసిటీ, మేనకూరు సెజ్‌ల్లోని కంపెనీల దగ్గర డబ్బులు వసూలుచేసి మింగేశాడు. ఆయనకు చెందిన రైస్‌మిల్లు నుంచే రేషన్‌ బియ్యాన్ని. స్వర్ణముఖి, కాళంగి నదులను ఏటీఎస్‌ (ఎనీ టైం శ్యాండ్‌)గా మార్చేసి, అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నాడు. శిరసనంబేడు కొండకు గుండుకొట్టించి గ్రావెల్‌ను అక్రమంగా దొంగిలించాడు. జగన్‌ జే బ్రాండ్లు తీసుకొస్తే.. ఆయన కే (కర్ణాటక)బ్రాండ్లు మద్యం తెచ్చి అనుచరులతో అమ్మిస్తున్నాడు. అనుచరుడి బార్‌ కోసం ఏకంగా జగన్‌ వైన్‌షాపులను మూయించేశాడు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మన కమలహాసన్‌కు కప్పం కట్టాల్సిందే. కాంట్రాక్టర్లు పర్సంటేజీ ఇవ్వాల్సిందే. హాఫ్‌ నాలెడ్జ్‌ మాజీ మంత్రి.. బెట్టింగ్‌ రాజు రూప్‌కుమార్‌తో కలిసి నాయుడుపేటలో వంద కోట్లు చేసే అక్రమ లేఅవుట్లు వేశారు. సూళ్లూరుపేట ముంపు ప్రాంతాల్లో కరెంట్‌ పోల్స్‌ సైతం మునిగిపోయే చోట కూడా అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. పులికాట్‌ సరస్సులో తెలుగు జాలర్లపై దాడులు చేయిస్తుంటే పట్టించుకోలేదు. పైగా న్యాయం కోసం వెళ్లిన మత్స్యకారులను కుక్కలతో పోల్చి అవమానించారు’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

నెల్లూరును నాశనం చేసిన వైసీపీ

‘ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీ నేతలు నాశనం చేశారు. ల్యాండ్‌, శ్యాండ్‌, వైన్‌, మైన్‌, క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియాలకు అడ్డాగా మార్చేశారు’ అని లోకేశ్‌ ఆగ్రహించారు. ‘ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2014లో వైసీపీకి 7, టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే ఇచ్చినా ‘నెవ్వర్‌ బిఫోర్‌’ అన్నట్టు అభివృద్ధి చేశాం. 2024లో అదే 10 సీట్లు టీడీపీకి ఇవ్వండి.. ‘ఎవ్వర్‌ ఆఫ్టర్‌’ అన్నట్టుగా నెల్లూరును నెంబరు వన్‌గా అభివృద్ధి చేసి చూపిస్తా. లేదంటే ఇక్కడే నన్ను నిలదీయండి. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే ఉండేది. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అటవీ అనుమతులు తీసుకుని తక్కిన లక్షా 30 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించాం’ అని యువనేత తెలిపారు.

ఇవిగో మేం తెచ్చిన పరిశ్రమలు

‘టీడీపీ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 73 పరిశ్రమలు తీసుకొచ్చాం. వీటి ద్వారా 32వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్‌ టర్బైన్స్‌, థర్మల్‌ పవర్‌టెక్‌, సీపీ ఆక్వా కల్చర్‌, ఫెడోరా సీఫుడ్స్‌, అంజని టైల్స్‌, ఇండ్‌సకాఫీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సౌత్‌ఇండియా కృష్ణా ఆయిల్‌ అండ్‌ ఫాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జెల్‌ కాప్స్‌ ఇండస్ట్రీస్‌, యూపీఐ పాలిమర్స్‌, పిన్నే ఫీడ్స్‌, బాస్ప్‌ ఇండియా లిమిటెడ్‌, దొడ్ల డెయిరీ, పెన్వేర్‌ ప్రోడక్ట్స్‌, అమరాతి టెక్స్‌టైల్స్‌, అరబిందో ఫార్మా, ఓరెన్‌ హైడ్రోకార్బన్స్‌ లాంటి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఇక్కడున్న పదిమంది ఎమ్మెల్యేలకు సవాలు విసురుతున్నా. మీరు తీసుకొచ్చిన పరిశ్రమ ఒక్కటైనా ఉందా? జిల్లాకు ఐదేళ్లలో టీడీపీ చేసిన అభివృద్ధిని జగన్‌ నాలుగు జన్మలెత్తినా చేయలేడు.’ అంటూ లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫెలో నాతో చర్చకు రా..

‘సింహపురిలో మీ లోకేశ్‌ సింహంలాగా అడుగుపెట్టాడు. యువగళానికి వచ్చిన ప్రజాదరణ చూసి పిల్ల సైకోలు ఏవేవో మొరుగుతున్నాయి. జగన్‌ సీఎం అయ్యాక మూడు కీలక పోస్టులు జిల్లాకు వచ్చాయి. ఆఫ్‌ నాలెడ్జ్‌ ఉన్న ఓ వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రి అయ్యాడు. ఆయనకు పని తక్కువ డైలాగులు ఎక్కువ. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేయని సిల్లీ బచ్చా నాకు సవాల్‌ ఇస్తాడంట. రా...రా.. వచ్చేయ్‌! నాయుడుపేటలోనే ఉన్నా. మీరు ఎంత అభివృద్ధి చేశారో, మేము ఎంత చేశామో మాట్లాడుకుందాం. అలాగే అవినీతి డబ్బు, బినామీల పేరుతో వంద కోట్ల రూపాయల అక్రమ లేఅవుట్‌ గురించి కూడా మాట్లాడుదాం. నీతోపాటు జగన్‌రెడ్డిని కూడా తీసుకురా.. దమ్ముంటే నెల్లూరు టికెట్‌ నీకు ఇస్తానని చెప్పమను. రెండో వ్యక్తి కోర్టు దొంగ.. వ్యవసాయ మంత్రి అయ్యాడు. అకాల వర్షాలకు రైతులు ఇబ్బందిపడుతుంటే బయటకు రాకుండా కల్తీ మద్యం తయారు చేశాడు. ఇక దివంగత మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. ఆయన మనమధ్య లేరు. ఆయన ఎంత చేసినా సైకో జగన్‌ వల్ల పరిశ్రమలు రాలేదు’ అని యువనేత వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-26T01:49:36+05:30 IST