శేషాచలం అభయారణ్యంపై చిరుత చిక్కుముళ్ళు ఎన్నో!
ABN , First Publish Date - 2023-08-19T01:15:30+05:30 IST
అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడులు ఏకంగా శేషాచలం అభయారణ్యం నిర్వహణపై చిక్కుముడులకు కారణమవుతున్నాయి.
తిరుపతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడులు ఏకంగా శేషాచలం అభయారణ్యం నిర్వహణపై చిక్కుముడులకు కారణమవుతున్నాయి. ఇతర టైగర్ రిజర్వుల్లో మానవ, వాహన సంచారంపై ఆంక్షలు అమలవుతుండగా చిరుతలున్న ప్రాంతాల్లో నిబంధనల వర్తింపుపై అస్పష్టత నెలకొంది. శేషాచలం రాష్ట్రప్రభుత్వంతో శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించబడినందున కొంతమేరకైనా ఆంక్షలు విధించాలని అటవీ శాఖ చేస్తున్న సూచనలను టీటీడీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
పాతికేళ్ళ కిందటే అభయారణ్యంగా శేషాచలం
తిరుమల కొండలతో కూడిన శేషాచలం అడవులను రాష్ట్రప్రభుత్వం పాతికేళ్ళ కిందటే శ్రీవెంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించింది. 1998 మే 13వ తేదీన అప్పటి ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన కోడూరు, రాజంపేట, తిరుపతి, భాకరాపేట రేంజిల పరిధిలోని శేషాచలం అడవులను అభయారణ్యంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. శేషాచలం మొత్తం అడవి విస్తీర్ణం 67,541.31 హెక్టార్లు లేదా 675.413 చదరపు కిలోమీటర్లు కాగా అందులో 52,597 హెక్టార్లు లేదా 525.97 చదరపు కిలోమీటర్ల అడవులు అభయారణ్యం పరిధిలోకి చేరాయి. తలకోనలో 1902 హెక్టార్లు, నాగపట్లలో 3782 , కరకంబాడిలో 1490, మామండూరులో 360, మామండూరు ఎక్స్‌టెన్షన్‌లో 4164, చామలలో 7746, చామల తిరుపతి కొండ ఆర్‌ఎఫ్‌లో 7508, తిరుపతి ఎక్స్‌టెన్షన్ ఏ-లో 828, తిరుపతి ఎక్స్‌టెన్షన్ బి-లో 650 హెక్టార్ల చొప్పున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 28,431 హెక్టార్ల అటవీ ప్రాంతం వుండగా మిగిలిన 24,166 హెక్టార్ల అడవులు ఉమ్మడి కడప జిల్లా పరిధిలోవున్నాయి. ఈ అడవుల్లో ఎలుగుబంట్లు, నక్కలు, అడవి కుక్కలు, అడవి పందులు, ముళ్ళ పందులు, అడవి పిల్లులు, పునుగు పిల్లులు, దేవాంగ పిల్లులు, జింకలు, దుప్పులు, కణుతులు వంటివి విరివిగా వున్నాయి. చిరుతల సంఖ్య పెరిగినందునే ఇపుడు నడక మార్గంలో అలజడి రేగుతున్న సంగతి తెలిసిందే.
టైగర్ రిజర్వుల్లో మానవ, వాహన సంచారంపై ఆంక్షలు
దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వులు లేదా అభయారణ్యాల్లో సాయంత్రం 6 గంటల నుంచీ ఉదయం 6 గంటల వరకూ మానవ సంచారం, వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలవుతున్నాయి. వీటిలో పుణ్యక్షేత్రాలు గనుక వుంటే కొంత సడలింపులతో ఆంక్షలు విధిస్తున్నారు. ఉదాహరణకు నంద్యాల జిల్లా శ్రీశైలం టైగర్ రిజర్వులో రాత్రి 9 గంటల నుంచీ ఉదయం 6 గంటల వరకూ వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు.పులులు, సింహాల కోవకే చెందిన చిరుత పులులు సంచరిస్తున్న శేషాచలం అడవుల్లో ఈ ఆంక్షల వర్తింపు ఇపుడు వివాదాస్పదంగా మారుతోంది.
అటవీ అధికారుల సూచనలు పట్టించుకోని టీటీడీ
సాయంత్రం 6 గంటల నుంచీ ఉదయం 6 గంటల వరకూ తిరుమల నడక దారుల్లో యాత్రికుల రాకపోకలు, అలాగే ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్నా టీటీడీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అటవీ శాఖ ఽఅధికారి వెల్లడించారు. కనీసం శ్రీశైలం తరహాలో రాత్రి 9 గంటల నుంచైనా ఆంక్షలు అమలు చేయాలని అభ్యర్థించినా టీటీడీ ఖాతరు చేయడం లేదని ఆ అధికారి వాపోయారు. చివరికి వాహనాలను ఆపకపోయినా కనీసం పాదచారులను, ద్విచక్ర వాహనాలనైనా రాత్రిళ్ళు ఆపాలని మొరపెట్టుకున్నా వినిపించుకోవడం లేదని చెబుతున్నారు. అభయారణ్యం అనేది వన్యప్రాణుల ఆవాసమని, అక్కడ వాటి కదలికలను పరిమితం చేయడం గానీ, లేదా బోనుల్లో బంధించి జూకు తరలించడం గానీ సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళే యాత్రికులు, వాహనాలు కావడంతో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి వుందన్నారు. సెంటిమెంట్ వల్ల తాము నిస్సహాయులమవుతున్నామని, అయితే వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి పరిమితంగానైనా ఆంక్షలు విధించాల్సిన అవసరం, బాధ్యత వుందన్నారు.
కెమెరా ట్రాప్‌ల పర్యవేక్షణకు సిబ్బంది కొరత
ఇటీవల నడక దారిలో చిరుతలు చిన్నారులపై దాడులకు పాల్పడడంతో క్రూర జంతువుల ఆనుపానులు తెలుసుకునేందుకు అటవీ అధికారులు హుటాహుటిన కెమెరా ట్రాప్‌ల ఏర్పాటుపై దృష్టి సారించారు. శ్రీశైలం నుంచీ 300 కెమెరా ట్రాప్‌లు తెప్పించారు. నడక దారి కేంద్రంగా చేసుకుని ఇరువైపులా 25 చదరపు కిలోమీటర్ల పరిధిలో కెమెరాలను అమర్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు గత గురువారం వీటిని అమర్చే కార్యక్రమం పూర్తయింది. అయితే కెమెరాల పర్యవేక్షణ, డేటా సేకరణకు సంబంధించిన టెక్నీషియన్లు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా శ్రీశైలం నుంచీ రప్పించారు. పది కెమెరాలకు ఒకరు చొప్పున టెక్నీషియన్ పనిచేయాల్సి వస్తోంది. ఇతర పనులకు కూలీలను స్థానికంగానే సమకూర్చుకున్నారు.
చిరుతల సంఖ్య తేలడానికి పక్షం రోజులు
కెమెరా ట్రాప్‌ల ఏర్పాటు వల్ల శేషాచలం అడవుల్లో ఏయే జంతువులు సంచరిస్తున్నాయో, అలాగే వాటి సంఖ్య తదితర వివరాలు తెలుసుకునే వీలుంది. శ్రీశైలం అడవుల్లో కెమెరాల నుంచీ పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే డేటా సేకరించి దాన్ని విశ్లేషించడం జరుగుతోంది. అయితే ఇక్కడ తిరుమల యాత్రికుల భద్రతకు సంబంధించిన విషయం కావడంతో రోజువారీ సేకరించాలని నిర్ణయించారు. ఆ మేరకు గురువారం అమర్చిన కెమెరాల నుంచీ శుక్రవారం డేటా సేకరించారు. వాటిలో చిరుతలు, దేవాంగ పిల్లులు, పునుగుపిల్లులు, అడవి పందులు, ముళ్ళ పందులు, జింకల కదలికలు ఎక్కువగా రికార్డయినట్టు గుర్తించారు. ఏయే జంతువులనేది ఫొటోల ఆధారంగా గుర్తించడం సులువే కానీ వాటి సంఖ్యను నిర్ధారించడానికి డేటాను శ్రీశైలం పంపించాల్సి వుంటుంది. అక్కడ వన్యప్రాణి నిపుణులు చిరుత పులుల వంటిపై వున్న మచ్చల ఆధారంగా ఒక్కోదాన్ని విడిగా గుర్తించడం జరుగుతుందని సమాచారం. అయితే అలా ఒక్కో జంతువును విడిగా గుర్తించడానికి పది రోజుల నుంచీ పదిహేను రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అంటే శేషాచలం అడవుల్లో ఎన్ని చిరుతలు వున్నాయనేది సుమారుగా అంచనా వేయాలన్నా పక్షం రోజులు నిరీక్షించాల్సిందే.
గతేడాది గణన ఫలితాలు అందని వైనం
ప్రతి నాలుగేళ్ళకూ అభయారణ్యాల్లో వన్యప్రాణులు ఎన్ని వున్నాయనేది అటవీ శాఖ లెక్కించడం జరుగుతుంది. ఆ క్రమంలో గతేడాది జంతు గణన చేపట్టారు. దానికి సంబంధించిన డేటాను విశ్లేషణ కోసం శ్రీశైలం పంపించారు. కానీ ఇంతవరకూ వాటి ఫలితాలు జిల్లాకు అందలేదు.
పట్టుబడిన చిరుతలను ఏం చేశారంటే...
జూన్ నుంచీ ఇప్పటి వరకూ మొత్తం మూడు చిరుత పులులు బోనుల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. తొలుత పట్టుబడిన చిరుతను ఆదోనికి చెందిన కౌశిక్ అనే చిన్నారిని లాక్కెళ్ళి తర్వాత వదిలిపెట్టేసిన చిరుతగా భావిస్తున్నారు. అయితే దాన్ని అటవీ అధికారులు శ్రీవారి మెట్టుకు సమీపాన వున్న నాగపట్ల అడవుల్లో వదిలిపెట్టేశారు. తర్వాత దొరికిన రెండింటినీ స్థానికంగా వున్న జూపార్కులో సంరక్షిస్తున్నారని సమాచారం. అయితే దీనిపైనా అనుమానాలు వున్నాయి. తొలుత పట్టుబడిన చిరుతను జూ పార్కులో కాకుండా శేషాచలం అడవిలోనే అదీ సమీపంగానే వదిలిపెట్టడంతో అదే తిరిగి నడక దారి ప్రాంతానికి వచ్చి లక్షితపై దాడి చేసివుండవచ్చన్న అనుమానమూ పలువురు వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన చిరుతలను తిరుమలకు ఉత్తరం వైపు కడప జిల్లా అడవుల్లో వదిలిపెట్టాలని లేని పక్షంలో శ్రీశైలం టైగర్ రిజర్వులోనైనా వదలాలని పలువురు సూచిస్తున్నారు. చిరుత సాధారణంగా రోజువారీ కిలోమీటరు నుంచీ పాతిక కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.అంతకు మించిన దూరంలో వదిలితేనే వెనుదిరిగి రావని చెబుతున్నారు. మొత్తానికీ చిరుతల విషయంలో నెలకొన్న చిక్కుముళ్ళను అటవీ శాఖ, టీటీడీ యంత్రాంగం ఎప్పటికి విప్పుతాయో వేచి చూడాల్సి వుంది.