ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం

ABN , First Publish Date - 2023-03-31T01:08:04+05:30 IST

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరమని ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ వి. కరుణకుమార్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం
ఎన్టీఆర్‌ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు

చిత్తూరు సిటీ, మార్చి 30: ఎన్టీఆర్‌ కీర్తి అజరామరమని ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ వి. కరుణకుమార్‌ అన్నారు. గురువారం స్థానిక రెడ్డి భవన్‌లో భారతీయ తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో, వ్యవస్థాపకులు మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో యుగపురుషుడు ఎన్టీఆర్‌ శత వసంతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ‘తెలుగు అక్షరం... తెలుగువారి ఆత్మగౌరవం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 24 మంది ప్రముఖులకు ఎన్టీఆర్‌ అంతర్జాతీయ పురస్కారాలను జడ్జి చేతులమీదుగా ప్రదానం చేశారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎన్టీయార్‌ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పారన్నారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని చెప్పారు. తెలుగు రచయితల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సి.నారాయణ స్వామి మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి అంటే ఎన్టీఆర్‌కు అమితమైన ప్రేమన్నారు. తన పాలనలో తెలుగులోనే సంతకాలు చేశారని, ప్రభుత్వ పథకాలకు, కార్యాలయాలకు తెలుగులోనే పేర్లు పెట్టేవారని చెప్పారు. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ కీర్తి చెక్కుచెదరదని అన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్‌ తులసి నెహ్రూ, డాక్టర్‌ నందిపాటి చక్రపాణి, డాక్టర్‌ జి.శాంతకుమారి, డాక్టర్‌ వి.రఘుపతి, కోటారి వెంకటరత్నం, డాక్టర్‌ కేసీ లావణ్య, మొగిలయ్య శెట్టి, హరిప్రసాద్‌ రెడ్డి, జ్ఞానశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T01:08:04+05:30 IST