బటన్‌ నొక్కడం కాదు..!

ABN , First Publish Date - 2023-07-21T02:32:36+05:30 IST

నేతన్న నేస్తం పేరిట ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం నిజానికి గతంలో చేనేత కార్మికులు పొందుతున్న లబ్ధిలో భారీగా కోత విధిస్తోంది.

 బటన్‌ నొక్కడం కాదు..!

అందని సబ్సిడీలు... వర్తించని బీమా పథకాలు

భారీగా పెరిగిన ముడి సరుకుల ధరలతో డీలా

వెంకటగిరి, జూలై 20: నేతన్న నేస్తం పేరిట ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం నిజానికి గతంలో చేనేత కార్మికులు పొందుతున్న లబ్ధిలో భారీగా కోత విధిస్తోంది. సీఎం జగన్‌ నేతన్న నేస్తం కింద లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేసేందుకు బటన్‌ నొక్కనున్న వెంకటగిరి నియోజకవర్గమే దీనికి నిదర్శనం. వెంకటగిరి పట్టణంలోనే 4 వేల నేత కుటుంబాలుంటే అందులో 1753 మందికే నేతన్న నేస్తం అందుతోంది. నిరుటితో పోలిస్తే అందులోనూ 66మందికి కత్తెర పడింది. ఇక 4 వేల కుటుంబాల్లో 1500మందికే నెలవారీ పెన్షన్లు అందుతున్నాయి. మునుపటి ప్రభుత్వంతో పోలిస్తే ఏకంగా 2500 పెన్షన్లకు కోత పడింది. అలాగే మునుపటి సబ్సిడీలు అందడం లేదు సరికదా కనీసం ఇదివరకటి బీమా పథకాలు కూడా అమలు కావడం లేదు. ముడి సరుకుల ధరలు భారీగా పెరిగిపోయిన నేపధ్యంలో చేనేత కార్మికుల బతుకులు భారంగా మారాయి. వెంకటగిరిలో చేనేత కుటుంబాల చరిత్ర ఈనాటిది కాదు. నాలుగు శతాబ్దాల ఘన చరిత వారి సొంతం. వెంకటగిరి రాజాలు తీసుకొచ్చిన కుటుంబాలు ఇక్కడ స్థిరపడి కాలక్రమంలో తలపాగాలు, జరీ, పట్టు చీరల తయారీ రంగంలో ఈ ఊరికి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఆర్జించిపెట్టాయి.గతకాలపు ఘనతలన్నీ కనుమరుగైపోయినా ఇప్పటికీ అదే రంగాన్ని నమ్ముకుని నాలుగు వేల కుటుంబాలు వెంకటగిరిలో బతుకుతున్నాయి. అందులోనే అత్యంత ప్రతిభాపాటవాలు చాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ అత్యున్నత పురస్కారాలు అందుకున్న చేనేత కళాకారులకూ కొదువ లేదు. అయితే వర్తమానం అధ్వానంగా మారిన నేపఽథ్యంలో చేనేత కార్మికులు కనాకష్టంగా బతుకీడుస్తున్నారు.

గత ప్రభుత్వంలో అనేక విధాలుగా సాయం!

వెంకటగిరి పట్టణంలో 4 వేల చేనేత కుటుంబాలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటికి ఒకరికి చొప్పున 4 వేల మందికి చేనేత కార్మికులకు పెన్షన్లు అందేవి. పెన్షన్ల మంజూరులో ప్రభుత్వం ఆంక్షలు, నిబంధనలు విధించకుండా సరళంగా వ్యవహరించేది. దీంతో దాదాపు ప్రతి కుటుంబమూ నెలకు రూ. 2 వేల చొప్పున ఏడాదికి రూ. 24వేల పెన్షన్‌ మొత్తాన్ని అందుకునేవి. ఆదరణ పథకం కింద జూకాడ్‌ మిషన్‌ వంటి పనిముట్లు సబ్సిడీతో అందేవి. చివరికి పట్టు కొనుగోలులో కూడా అప్పటి ప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున సబ్సిడీ అందించేది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్‌ దుస్తులను చేనేత కార్మికులతో నేయించేది. దీనితో వేలాది చేనేత కుటుంబాలు అబ్ధి పొందేవి. చివరికి వర్షాలకు చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరితే పనులు ఆగిపోతాయి కనుక కుటుంబానికి రూ. 11,500 నగదు, 20 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌, కిలో కందిపప్పు సాయంగా అందించేది. వీటికి తోడు రెండు రకాల బీమా పథకాలు అమలయ్యేవి. ఒక దాని ద్వారా అనారోగ్యానికి రూ. 15 వేలు, ఎవరైనా మృతి చెందితే మరో పథకం ద్వారా కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున సాయం అందేది. వీటన్నింటికీ మించి గత ప్రభుత్వంలో బాధిత కుటుంబాలకు పెద్దఎత్తున సీఎం సహాయ నిధి నుంచీ ఆర్థిక సాయాలు అందాయి. మరోవైపు ముడిసరుకుల ధరలు అందుబాటులో వుండేవి. కీలక ముడి సరుకైన పట్టు కిలో రూ. 3 వేలు వుండేది. ఇతర నిత్యావసర ధరలూ అందుబాటులో వుండేవి.

నాలుగేళ్ళుగా అన్నింటా కోతలూ, కత్తెరలే!

గత నాలుగేళ్ళుగా చేనేత కార్మికుల పథకాలలో అన్నింటా కోతలూ, కత్తెరలే కనిపిస్తున్నాయి. వెంకటగిరిలోని 4 వేల కుటుంబాలకు గతంలో పెన్షన్లు అందగా ఇపుడు కేవలం 1500 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. ఆంక్షలు, నిబంధనల పేరిట ఏకంగా 2500 పెన్షన్లను కత్తరించారు. ఈ రూపంలో వెంకటగిరిలోని 2500 మంది చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 6 కోట్లు కోత పడినట్టయింది. 4 వేల కార్మికుల్లో ఇపుడు ప్రభుత్వం నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ. 24 వేల వంతున ఇస్తున్నది కేవలం 1753 మందికి మాత్రమే. పెన్షన్ల రద్దు ద్వారా ప్రభుత్వం రూ. 6 కోట్లు కోత విధించగా నేతన్న నేస్తం ద్వారా ఇస్తున్నది రూ. 4.20 కోట్లు మాత్రమే. అంటే గతంలో కార్మికులు పొందుతుండిన రూ. 6 కోట్ల లబ్ధిలో రూ. 1.80 కోట్లు నష్టపోతున్నట్టు లెక్క. ఇంకోవైపు గతంలో లాగా సబ్సిడీ పనిముట్లు ఇవ్వడం లేదు. పట్టు కొనుగోలుపై సబ్సిడీ సైతం రద్దయింది. స్కూలు విద్యార్థుల యూనిఫామ్‌ మరమగ్గాల ద్వారా తయారు చేయిస్తుండడంతో చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతింటోంది. వర్షాలకు మగ్గాల గుంతల్లో నీరు చేరినా పట్టించుకునే దిక్కు లేదు. రెండు బీమా పథకాలు కూడా నిలిచిపోయాయి. సీఎం సహాయ నిధి నుంచీ కూడా బాధితులకు నయాపైసా అందిన దాఖలాలు లేవు. పట్టు ధర కిలో గతంలో రూ. 3 వేలు వుంటే ఇపుడు ఏకంగా రూ. 6-8 వేల మధ్య పలుకుతోంది. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఎలా మండుతున్నదీ తెలియంది కాదు.

నేతన్న నేస్తం వల్ల ఒరిగేదేమీ లేదు : లక్కా శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత

వైఎస్సార్‌ నేతన్న నేస్తం వల్ల చేనేత కార్మికులకు ఒరిగేదేమీ లేదు. అది తాత్కాతిక ఊరట మాత్రమే. కార్మికుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపాలంటే ప్రభుత్వమే చేనేత కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అర్హులైన నేత కార్మికులను గుర్తించి వారికి అవసరమైన ముడి సరుకులు ఇవ్వాలి. కార్మికులు నేసిన చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

సబ్సిడీలు ఇవ్వాలి : జింకా బాలసుబ్రమణ్యం, చేనేత కార్మికుడు

పట్టు, జరీ, నూలు వంటి ముడిసరుకులపై ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి. పరికరాలు, పనిముట్లకు కూడా సబ్సిడీలు ఇవ్వాలి. చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలి. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ ఉచితంగా ఇవ్వాలి.

పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేకే.: సత్తల లావణ్య, చేనేత కార్మికురాలు

ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. నేసిన చీరలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. మగ్గం మీద నేసిన చీరలను నష్టానికి అమ్ముకుంటున్నాం. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక ఇతర పనులకు పోకుండా కష్టమైనా నష్టమైనా చేనేత పనినే నమ్ముకుని బతుకుతున్నాం.

Updated Date - 2023-07-21T02:32:36+05:30 IST