మునిరాజమ్మకు రూ.ఐదు లక్షల సాయం

ABN , First Publish Date - 2023-03-05T01:12:58+05:30 IST

శ్రీకాళహస్తిలో అధికార పార్టీ నేతల దౌర్జన్యానికి గురైన బీసీ వర్గాల మహిళ మునిరాజమ్మ శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు.

మునిరాజమ్మకు రూ.ఐదు లక్షల సాయం
చంద్రబాబుతో మాట్లాడుతున్న మునిరాజమ్మ

తొట్టంబేడు/అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తిలో అధికార పార్టీ నేతల దౌర్జన్యానికి గురైన బీసీ వర్గాల మహిళ మునిరాజమ్మ శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. తన భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె తనపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలున్నారని, ఆర్థిక కష్టాల్లో ఉన్న తాము అప్పుచేసి రాజీవ్‌నగర్‌లో చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటుండగా వైసీపీ నాయకులు వేధింపులకు గురిచేసినట్లు, అన్యాయంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదని, టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీ తరపున ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి నన్ను చాకలిదాన్నని నిందించారు. ఆయన పార్టీ వాళ్లు అనరాని మాటలన్నారు. వైసీపీ ఎమ్మెల్యే బూటు కాళ్లు నాకి క్షమాపణ చెబితే వదిలిపెడతామన్నారు. నాపై జరిగిన దౌర్జన్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే నాపైనే ఎదురు కేసు పెట్టారు’ అని వాపోయారు.

Updated Date - 2023-03-05T01:12:58+05:30 IST