కిందే వైకుంఠం కనిపిస్తోంది!
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:41 AM
వైకుంఠ ఏకాదశికి రెండు రోజులు ముందుగానే భక్తులకు వైకుంఠం కనిపిస్తోంది. ఎముకలు కొరికే చలిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పెద్దఎత్తున భక్తులు ఎదురుచూడ్డం మొదలెట్టారు.
- ముక్కోటి టోకెన్ల కోసం చలిలో భక్తుల గజగజ
-11.30 గంటలకు టోకెన్ల జారీని ప్రారంభించిన టీటీడీ అధికారులు
తిరుపతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : వైకుంఠ ఏకాదశికి రెండు రోజులు ముందుగానే భక్తులకు వైకుంఠం కనిపిస్తోంది. ఎముకలు కొరికే చలిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పెద్దఎత్తున భక్తులు ఎదురుచూడ్డం మొదలెట్టారు. తిరుపతిలోని శ్రీనివాసం, ఇందిరా మైదానం, జీవకోన, బాలాజీనగర్ కమిటీ హాలు, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్‌పల్లిలోని జడ్పీ హైస్కూల్ ప్రాంతాల్లో టోకెన్ల కోసం భక్తులు గురువారం రాత్రంతా పడిగాపులు కాశారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు టోకెన్లు జారీచేస్తామని ఆయా కేంద్రాల వద్ద టీటీడీ అధికారులు ప్రకటించినప్పటికీ గురువారం సాయంత్రం 6గంటల నుంచే కేంద్రాల వద్దకు భక్తులు చేరుకున్నారు. రద్దీని గమనించి వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో టోకెన్లు జారీ ప్రారంభిస్తారేమోనన్న ఆనుమానంతో దుప్పట్లు కప్పుకుని, స్వెటర్లు ధరించి టోకెన్ జారీ కేంద్రాల వద్ద గుమికూడారు. ముఖ్యంగా అలిపిరి, ఇందిరామైదానం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు.చలి ఎక్కువగా వుండడంతో ఇబ్బంది పడుతూనే వేచివున్నారు. గత ఏడాది గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పెద్దఎత్తున తోపులాటలు, తొక్కిసలాటలు జరగడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈసారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కనిపించింది.కాగా గురువారం రాత్రి 11.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనా లకు టోకెన్ల జారీ ప్రారంభమైంది.