సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం
ABN , First Publish Date - 2023-11-26T00:56:22+05:30 IST
మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను కాపాడుకుందామని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు అన్నారు.
ఐరాల(కాణిపాకం), నవంబరు 25: మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను కాపాడుకుందామని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు అన్నారు. ఆలయ ఆస్థాన మండపంలో శనివారం 8వ జాతీయస్థాయి నంది నృత్య మహోత్సవాలను శ్రీసాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్సు డెవల్‌పమెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళలు అంతరించి పోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంప్రదాయాలు, కళలు దేశ ఔన్నత్యాన్ని చాటుతాయని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి రెండు వందల మంది కళాకారులు విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువులతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పాలన్నారు. భరతనాట్యం, కూచిపూడి, జానపదం, మణిపురి, ఆంధ్రనాట్యం, ఒడిస్సీ, కథక్, పేరిణి నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ పల్లశెట్టి సురేష్, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ప్రోగాం కమిటీ మెంబరు లక్ష్మీపతి, హెల్త్ డైరెక్టర్ బాలాజి తదితరులు పాల్గొన్నారు.