Share News

ఆడుదాం ఆంధ్రాతో ఒరిగేదేంటి?

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:07 AM

‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడాపోటీలు జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి మొదలు కానున్నాయి. క్రికెట్‌ , వాలీబాల్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌,ఖోఖో క్రీడలకు 1,53,423మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ఆడుదాం ఆంధ్రాతో ఒరిగేదేంటి?

ఇంతకాలం క్రీడలను పట్టించుకోని ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ ముందుకొస్తోంది. పాఠశాలల్లో క్రీడా మైదానాల ఆక్రమణలను అరికట్టి.. వాటిని అభివృద్ధి చేసి.. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడేమో పొలాలు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మైదానాలుగా మారుస్తూ ఆటాడిస్తామంటోంది. - తిరుచానూరు/చంద్రగిరి/తిరుపతి(రవాణా)

క్రీడలపై అవగాహనలేని

కార్యదర్శుల ఆధ్వర్యంలో పోటీలా?

ఎన్నికల వేళ ప్రచారానికేనన్న విమర్శలు

‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడాపోటీలు జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి మొదలు కానున్నాయి. క్రికెట్‌ , వాలీబాల్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌,ఖోఖో క్రీడలకు 1,53,423మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.మరో 15150మంది క్రీడాభిమానులు కూడా నమోదు చేసుకున్నారు.సచివాలయ స్థాయి పోటీలు మంగళవారం నుంచి జనవరి 9 వరకు, నియోజకవర్గ స్థాయిలో జనవరి 10 నుంచి జనవరి 24 వరకు, జిల్లా స్థాయిలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వరకు జరగనున్నాయి. అనుభవజ్ఞులైన పీఈటీ, పీడీల పర్యవేక్షణలో నిర్వహించాల్సిన ఈ పోటీలను.. క్రీడలపై అవగాహనలేని పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.ఈ పోటీలకు సంబంధించి వలంటీర్లకు రెండుసార్లు వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ ఇప్పించారు.సచివాలయ ఉద్యోగులు క్రీడా నిర్వహణలో పాలుపంచుకోనున్నారు.క్రీడల నిర్వహణకు ఎంతో ముఖ్యమైన మైదానాల విషయంలో అధికారులు విఫలమయ్యారు.స్కూలు మైదానాలు దొరకని చోట్ల ప్రైవేటు స్థలాలను మైదానాలుగా మారుస్తున్నారు.బలవంతంగా వేలల్లో రిజిస్ర్టేషన్లు చేశారు. ఎవరి పర్యవేక్షణలో అడించాలో నిర్ణయం తీసుకోలేకపోయారు.చివరి నిమిషంలో చేసేదేం లేక వ్యాయామ ఉపాధ్యాయులుంటే వారిని, లేకపోతే హెచ్‌ఎంలను సూపర్‌వైజర్లుగా నియమించి వలంటీర్లను అంపైర్లుగా చేశారు. వందలాదిమంది సచివాలయాల పరిధిలో తలపడతారు. యువతీ యువకులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడం కత్తిమీద సామే.

ఎన్నికల ప్రచారానికేనా?

కేంద్రప్రభుత్వం నిర్వహించే ‘ఖేలో ఇండియా’ కే ‘ఆడుదాం ఆంధ్రా’ అని పేరు పెట్టారే తప్ప ఇదేం కొత్త కార్యక్రమం కాదని క్రీడాకారులంటున్నారు. ఈ పోటీల వల్ల క్రీడాకారులకు ఒరిగేదేమీ లేదని వ్యాయామ ఉపాఽధ్యాయులు అంటున్నారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడేలా మార్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఫిబ్రవరి 10వతేది వరకు ఈ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం జరగనుంది. అప్పటి వరకు అధికార పార్టీ ప్రచారానికి ఈ క్రీడాపోటీలను వేదికగా చేసుకుంటారన్న ఆరోపణలున్నాయి.

తిరుపతిలో ప్రారంభోత్సవ కార్యక్రమం

జిల్లాలో 47 రోజుల పాటు జరగనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ వేదికగా మంగళవారం జరుగుతుందని, ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆటల పోటీలకు ఐదువందలకు పైగా మైదానాలను గుర్తించామ న్నారు. ఆటవిడుపుగా క్రీడాకారులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

Updated Date - Dec 26 , 2023 | 02:07 AM