కోలాహలంగా జల్లికట్టు
ABN , First Publish Date - 2023-01-18T00:11:17+05:30 IST
బ్రాహ్మణపల్లె, కురివికుప్పంలో జనమే జనం
ముక్కనుమను పురస్కరించుకుని వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లె, కురివికుప్పం గ్రామాల్లో మంగళవారం జల్లికట్టు జరిగింది. ఆయా గ్రామాల్లో అల్లిని ఏర్పాటు చేశారు. ఆ అల్లిలో యువకులు నిలబడి కోడెగిత్తలను నిలువరించారు. మిగతా జనం మిద్దెలు, గోడలు తదితర వాటిని ఎక్కి జల్లికట్టును చూశారు. నిర్వాహకులు, యజమానులు తమ తమ కోడె గిత్తల కొమ్ములకు బహుమతులుగా ఉపయోగించే పట్టీలకు నాయకులు, సినీ హీరోలు, దేవుళ్ల ఫొటోలను కట్టారు. కొన్ని గిత్తల కొమ్ములకు టవళ్లను కట్టి అందులో నగదు పెట్టారు. అల్లి వైపు వదిలిన ఈ గిత్తలు యువకులకు చిక్కకుండా పరుగు తీశాయి. అయినా, కొందరు వీటిని పట్టుకుని, పట్టీలను దక్కించుకున్నారు. బ్రాహ్మణపల్లెలో జల్లికట్టును చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. ఆ గ్రామంలో జనంతో నిండిపోయింది. ఎటు చూసినా బ్రాహ్మణపల్లెలో జనమే కనిపించారు. కాగా, ఈ రెండు గ్రామాల్లో జల్లికట్టు ప్రశాంతంగా ముగియడంతో గ్రామస్తులు, నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అన్నదానం చేశారు. ఆయా గ్రామాల్లో జనసందడి నెలకొంది. పండగ వాతావరణం ఉట్టిపడింది.
- వెదురుకుప్పం