ఎన్‌ఎన్‌డీపురంలో జల్లికట్టు
ABN , First Publish Date - 2023-12-11T01:29:15+05:30 IST
ఎస్‌ఆర్‌పురం మండలం ఎన్‌ఎన్‌డీపురం అలియాస్ మంగణాంపల్లె గ్రామంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు.
శ్రీరంగరాజపురం, డిసెంబరు 10: ఎస్‌ఆర్‌పురం మండలం ఎన్‌ఎన్‌డీపురం అలియాస్ మంగణాంపల్లె గ్రామంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పశువుల పండుగ సందర్భంగా జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఎన్‌ఎన్‌డీపురంలో ఎన్నడూ జల్లికట్టు నిర్వహించిన దాఖలాలు లేవు. తొలిసారిగా ఆదివారం ఆ గ్రామంలో జల్లికట్టు జరిపించారు. దీనికోసం గ్రామంలో అల్లిని ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కోడెగిత్తల కొమ్ములకు బహుమతులుగా ఉపయోగించే పట్టీలను కట్టారు. వీటికి జనసేనాని పవన్ కల్యాణ్‌తోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు.. గిత్తల యజమానులు.. దేవుళ్ల ఫొటోలను కట్టారు. డప్పు శబ్ధాలతో అల్లివైపు వదిలారు. అప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువకులు అల్లిలో నిలబడ్డారు. మిగతా వారు గోడలు, మేడలపై నిలబడి జల్లికట్టును చూశారు. అల్లివైపు వచ్చిన గిత్తలను నిలువరించే ప్రయత్నంలో పలువురు కిందపడటంతో గాయాలయ్యాయి. గిత్తల కింద పడిన వారిలో చంద్రగిరి మండలం పనపాకంకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. గిత్తలను నిలువరించి పట్టీలను దక్కించుకున్న యువకులు సందడి చేశారు. జల్లికట్టుకు తరలివచ్చిన జనంతో ఎన్‌ఎన్‌డీపురం సందడిగా మారింది.