తోబుట్టువుల్లాగా చూసుకుంటానన్న మాట ఏమైంది జగనన్నా?

ABN , First Publish Date - 2023-09-26T00:59:31+05:30 IST

‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలను తోబుట్టువుల్లాగా చూసుకుంటాను. తెలంగాణకంటే రూ.వెయ్యి ఎక్కువగా జీతాలిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పిన మాట ఏమైంది జగనన్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఆ హామీని నెరవేర్చలేదే’ అంటూ అంగన్వాడీలు సీఎంను ప్రశ్నించారు.

తోబుట్టువుల్లాగా చూసుకుంటానన్న మాట ఏమైంది జగనన్నా?

సీఎంకు అంగన్వాడీల సూటిప్రశ్న

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టీకరణ

చిత్తూరు, సెప్టెంబరు 25: ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలను తోబుట్టువుల్లాగా చూసుకుంటాను. తెలంగాణకంటే రూ.వెయ్యి ఎక్కువగా జీతాలిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పిన మాట ఏమైంది జగనన్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఆ హామీని నెరవేర్చలేదే’ అంటూ అంగన్వాడీలు సీఎంను ప్రశ్నించారు. అంగన్వాడీలకు పనిభారం పెరగడంతో గత టీడీపీ ప్రభుత్వం రూ.7,500 ఉన్న వేతనాన్ని ఎన్నికల చివరినాటికి రూ.10,500కి పెంచారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.14,500 ఇస్తున్నారు. ఈ లెక్కన సీఎం జగన్‌ చెప్పినట్లు పెంచితే రూ.15,500 ఇవ్వాలి. అలాగే పీఎఫ్‌, ఈఎ్‌సఐ, గ్రాడ్యూటీ ఇస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు ఈ హామీల్లో ఒక్కటీ నెరవేర్చకపోవడంపై వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

హక్కుల కోసం పోరాడేవాళ్లను ఈ ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం అందించే ఏ పథకానికి అర్హులుగా కాలేకపోతున్నాం. 2017 నుంచి ఇప్పటివరకు టీఏ బిల్లులు రాలేదు. వచ్చే వేతనాలతో బస్సు ఛార్జీలు పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

- సుజని, జిల్లా ఉపాధ్యక్షురాలు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌.

హామీలు నెరవేర్చేవరకు పోరాటం

ఎన్నికలకు ముందు అంగన్‌వాడీ వర్కర్లకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంతో ముఖ్యభూమిక పోషిస్తున్నాం. అలాంటి తమకు రావాల్సిన హక్కులను సాధించుకునేంత వరకు పోరాటాన్ని కొన సాగిస్తాం.

- మమత, అధ్యక్షురాలు, యాదమరి మండలం.

Updated Date - 2023-09-26T00:59:31+05:30 IST